
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోలు బంకులు మూతపడ్డాయి. తమ డిమాండ్ల సాధనలో భాగంగా పెట్రోలు, డీజల్ బంకుల యాజమాన్యాలు సమ్మెకు సిద్ధపడ్డాయి. అఖిల భారత సంఘం పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల్లో కూడా సమ్మెకు డీలర్లు సిద్ధపడ్డారు. ఇందులో భాగంగానే ఏపిలో పెట్రోలు, డీజల్ లిఫ్టింగ్ పాయింట్ల నుండి ట్యాంకర్లు బయలుదేరకుండా గురువారం మధ్యాహ్నం విజయవాడలోని సంఘం అధ్యక్ష, కార్యదర్శుల ఆధ్వర్యంలో పలువురు లిఫ్టింగ్ పాయింట్ల వద్ద బైఠాయింపు జరిపారు. దాంతో అక్కడ ఆయిల్ కంపెనీల ఉద్యోగులకు, బంకుల యజమానులకు మధ్య వాదనలు మొదలయ్యాయి.
అయితే, వాదనలు కాస్త ముదరటంతో కొద్దిసేపటికి పెద్ద గొడవగా మారింది. ఆ తర్వాత ఉద్రిక్త పరిస్ధితులకు దారితీసింది. ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దాంతో గొడవ కాస్త బాగా పెరిగిపోవటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. అంతేకాకుండా సంఘం అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసారు. దాంతో నిరసనగా రాష్ట్రవ్యప్తంగా సుమారు 4200 పెట్రోలు బంకులను యాజమాన్యాలు మూసేసాయి. ఒక్కసారిగా రాష్ట్రం మొత్తం పెట్రోలు, డీజల్ బంకులు మూతపడటంతో ప్రజలకు ఏమి జరిగిందో అర్ధం కాలేదు.
అయితే, జరిగిన విషయాన్ని టివిల ద్వరా తెలుసుకున్న వాహనాల యజమానులు పరిస్ధితిని గమనించి పెట్రోలు, డీజెల్ కోసం బంకులకు క్యూ కట్టటంతో బంకుల వద్ద అనూహ్యంగా రద్దీ పెరిగిపోయింది. దాంతో దాదాపు అన్నీ బంకుల వద్దా తోపులాటలు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయానికల్లా అధ్యక్ష, కార్యదర్శులతో పాటు అరెస్టు చేసిన వారందరినీ విడుదల చేయకపోతే బంకులను నిరవధికంగా మూసేస్తామని పెట్రోలు, డీజల్ డీలర్ల సంఘం ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసింది. పెట్రోలు బంకుల యజమానులు తీసుకున్న ఈ నిర్ణయంతో ఏపి మొత్తం ఒక్కసారిగా పెట్రోలు, డీజెల్ కు కటకట మొదలైంది.
ఇదిలావుండగా తెలంగాణాలో కూడా అదే పరిస్ధితి ఎదురయ్యేట్లు కనబడుతోంది. ఏపిలో అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయకపోతే తెలంగాణాలో కూడా బంకులను నిరవధికంగా మూసేస్తామని సంఘం ముఖ్యులు తెలిపారు. ఇదే విషయమై తెలంగాణా డీలర్ల సంఘం సంయుక్త కార్యదర్శి రాజీవ్ ‘ఏషియానెట్’ తో మాట్లాడుతూ, ఏపిలోని సంఘం ముఖ్యుల అరెస్టులకు నిరసనగా తాము కూడా రాష్ట్రవ్యాప్తంగా బంకులను మూసేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తమకు ఇవ్వాల్సిన కమీషన్ ఇవ్వకుండా, ట్యాంకర్లకు నెలవారీ అద్దెలు పెంచకుండా, డీలర్ బంకులకు నెలకు ఇవ్వాల్సిన అద్దెలను కూడా పెంచకుండా ఆయిల్ కంపెనీలు ఇబ్బంది పెడుతున్నట్లు ఆరోపించారు.
మామూలుగా అయితే షెడ్యూల్ ప్రకారం శుక్రవారం పూర్తిగా బంకులు నడుస్తాయని, శనివారం ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకే బంకులు పనిచేస్తాయని, ఆదివారం శెలవు దినంగా తెలిపారు. అయితే, అరెస్టు చేసిన తమ సంఘం ముఖ్యులను గనుక వెంటనే విడుదల చేయకపోతే శుక్రవారం ఉదయం నుండే నిరవధికంగా బంకులను మూతవేస్తామని హెచ్చరించారు.