విశాఖపట్నం నుంచి పాలన సాగించే దిశగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నాటికి విశాఖకు తరలివెళ్లనున్నట్టుగా కూడా సీఎం జగన్ ఇటీవల ప్రకటించారు.
విశాఖపట్నం నుంచి పాలన సాగించే దిశగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ నాటికి విశాఖకు తరలివెళ్లనున్నట్టుగా కూడా సీఎం జగన్ ఇటీవల ప్రకటించారు. విశాఖలో సీఎం, అధికారుల వసతులకు సంబంధించి ప్రభుత్వం త్రీమెన్ కమిటీని కూడా నియమించింది. అయితే విశాఖపట్నంలోని రుషికొండపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విజయవాడకు చెందిన లింగమనేని శివరామ ప్రసాద్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. రుషికొండలో సీఎం కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చట్టవిరుద్ధమని తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
రుషికొండ బంగాళాఖాతం పక్కనే ఉన్న కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) పరిధిలో ఉందని పేర్కొన్నారు. కొండపై నిర్మాణం, చట్టబద్ధతకు సంబంధించిన అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉందని పిల్‌లో తెలిపారు. 2011 నాటి సీఆర్‌జెడ్ నోటిఫికేషన్ రాజ్యాంగబద్ధత తుది విచారణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందు పెండింగ్‌లో ఉందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. సీఆర్‌జెడ్ పరిమితులు, అనుమతించదగిన కార్యకలాపాలు, ఎఫ్‌ఎస్‌ఐ సవరణల పరిధికి సంబంధించిన ప్రధాన సమస్యలు తీర్పు పెండింగ్‌లో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం న్యాయ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తూ రుషికొండపై నిర్మించిన భవనాల్లో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు.
రుషికొండపై రిసార్ట్ నిర్మాణానికి మాత్రమే అనుమతి లభించిందని శివరామ ప్రసాద్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇందుకు విరుద్దంగా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అనేది.. పొందిన అనుమతులను, హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించడమేనని అన్నారు. రుషికొండలో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏర్పాటు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించేలా తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన సుప్రీం కోర్టుకు విజ్ఞప్తి చేశారు.
హైకోర్టు, ఎన్‌జీటీల ముందు రుషికొండపై నిర్మాణాలకు సంబంధించిన కేసులు పరిష్కారం అయ్యే దాకా.. ఇక్కడ తదుపరి నిర్మాణాలు, అనుబంధ కార్యకలాపాలేవీ జరగకుండా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు. రుషికొండ నిర్మాణాలపై గతంలో సుప్రీం కోర్టు ఉత్తర్వుల కాపీని కూడా జతచేసినట్టుగా కూడా పేర్కొన్నారు. ఇక, రుషికొండపై పర్యాటక రిసార్ట్ పునరుద్దరణతో చేపట్టిన నిర్మాణాలు.. ప్రస్తుతం సీఎం క్యాంపు కార్యాలయానికి కేటాయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే.