మణప్పురం గోల్డ్ లోన్ లో ఇంటిదొంగ నిర్వాకం... 10 కిలోల బంగారంతో ఉద్యోగిని జంప్ (వీడియో)

By Arun Kumar P  |  First Published Oct 19, 2023, 9:52 AM IST

మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో కస్టమర్లు తాకట్టుపెట్టిన బంగారంతో ఓ మహిళా ఉద్యోగిని పరారయిన ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు బ్రాంచ్ లో వెలుగుచూసింది. 


మచిలీపట్నం : ప్రముఖ బంగారు రుణాల సంస్థ మణప్పురం గోల్డ్ లోన్ లో ఇంటిదొంగలు పడ్డారు. ఓ మహిళా ఉద్యోగి కోట్ల విలువచేసే బంగారంతో పరారవడం ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపింది. కృష్ణా జిల్లా కంకిపాడు శాఖలోని కస్టమర్లు  దాచిన బంగారంతో ఉడాయించింది మేనేజర్ పావని. దీంతో సంస్థ యాజమాన్యంతో పాటు కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. 

కంకిపాడులోని మణప్పురం గోల్డ్ లోన్ సంస్థలో పావని మేనేజర్ గా పనిచేస్తోంది. ఇటీవల ఆమె విధులకు హాజరుకాకపోవడం... ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉన్నతాధికారులు బ్రాంచ్ కు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో 1477 మంది కస్టమర్లు తాకట్టుపెట్టిన 16 కిలోల బంగారంలో 10కిలోలు కనిపించకపోవడంతో అధికారులు కంగుతిన్నారు. 

Latest Videos

మణప్పురం సంస్థ అధికారులు ఫిర్యాదు మేరకు మేనేజర్ పావని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలు సిసి కెమెరాల ఆధారంగా ఆమె ఎక్కడికి వెళ్లిందో గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఆచూకీ కోసం ఆమె బంధువులు, సన్నిహితులను ఆరా తీస్తున్నారు.  

వీడియో

తమ బంగారంతో మేనేజర్ ఉడాయించినట్లు తెలియడంతో కంకిపాడు మణప్పురం గోల్డ్ లోన్ కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో బ్రాంచ్ వద్దకు భారీగా కస్టమర్లు చేరుకుంటున్నారు. అయితే ఎవరూ ఆందోళనకు గురికావద్దని... ఎవరికీ నష్టం జరక్కుండా చూస్తామని గోల్డ్ లోన్ సంస్థ ఉన్నతాధికారులు చెబుతున్నారు. 

అయితే కస్టమర్ల బంగారంపై కన్నేసిన పావని ఎప్పటినుండో దోపిడీకి పథకం వేసిందట. ఈ  క్రమంలోనే ఓ వ్యక్తి సహకారంతో అనుకున్నంత పని చేసింది. 10 కిలోల బంగారంతో పావని పారిపోయేందుకు సహకరించిన వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్నట్లు తెలిసింది. అతడిని విచారిస్తున్న పోలీసులు పావని ఎక్కడికి వెళ్లింది? బంగారం ఎక్కడ దాచింది? ఈ వ్యవహారంలో ఇంకెవరి హస్తమైనా వుందా? తదితర విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే పావని ఆఛూకీ గుర్తించి బంగారం స్వాధీనం చేసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 
 

click me!