
కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల కన్నా నేతల ప్రభావమే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి నేతలు కేవలం వారి అవసరాల కోసం మాత్రమే పార్టీలు మారుతుంటారు. అటువంటి నియోజకవర్గాల్లో పార్టీల ప్రాభవం పెద్దగా కనబడదు. తెలుగుదేశం కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ కూడా కావచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్ లేదు కాబట్టి ఆ స్ధానాన్ని వైఎస్ఆర్సిపి భర్తీ చేస్తోంది. ఎన్నికల సమయంలో గాలి ప్రభావం కూడా ఎప్పుడో గానీ కనబడదు. అటువంటి నియోజకవర్గాలు ఎక్కువగా రాయలసీమలోనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోనే. ఎందుకంటే, పై జిల్లాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలు ఎక్కువ. ఇపుడు ఫ్యాక్షన్ ప్రభావం చాలా వరకూ తగ్గినా ఇంకా వాసనలైతే పూర్తిగా పోలేదు.
ఇపుడిదంతా ఎందుకంటే, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీలో చేరారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో భూమా శోభారెడ్డి వైసీపీ తరపున పోటీ చేసారు. గెలిచిన కొద్ది కాలానికే మరణించటంతో ఆమె కూతురు అఖిలప్రియ పోటీ చేసి గెలిచారు. అయితే, భూమా కుటుంబం వైసీపీ నుండి టిడిపిలోకి మారింది. అప్పటి నుండి ఇరు వర్గాల మధ్య సమస్యలు మొదలయ్యాయి. దాంతో గంగుల కుటుంబం వైసీపీలో చేరింది.
ఇటువంటి పరిస్ధితి ఒక్క ఆళ్ళగడ్డలో మాత్రమే కాదు. ఇదే జిల్లాలోని నంద్యాల, నందికొట్కూరు, కోడూమూరు, శ్రీశైలం, కర్నూలు, పాణ్యం, పత్తికొండలోనూ కనబడుతుంది. అలాగే, కడప జిల్లాలోని జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, బద్వేలు తదితర నియోజకవర్గాల్లో కూడా నేతలు అటు, ఇటు మారుతూనే ఉంటారు. ఇక, అనంతపురం జిల్లాలో అయితే తాడిపత్రి, రాయదుర్గం, రాప్తాడు, గుంతకల్, పెనుగొండ, మడకశిర, ధర్మవరం లాంటి నియోజకవర్గాల్లో కూడా అదే వరస. కాబట్టి పార్టీ అధినేతలు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఒక వర్గం ఒక పార్టీలో ఉంటే, ప్రత్యర్ధి వర్గం తప్పని సరిగా ఇంకో పార్టీలోకి మారుతుంది.