స్టాలిన్ నిర్ణయంతో వేడెక్కిన తమిళ రాజకీయాలు

First Published Feb 17, 2017, 1:56 PM IST
Highlights

పళని ప్రభుత్వానిది మూణ్ణాల ముచ్చటేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.

తమిళనాడు రాజకీయాలు మళ్ళీ ఒక్కసారిగా వేడెక్కాయి. శనివారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న పళనిస్వామికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి డెవలప్మెంట్లు. విశ్వాస పరీక్షతో తమకు సంబంధం లేదని ఉదయం ప్రకటించిన డిఎంకె నేత స్టాలిన్ సాయంత్రానికి నిర్ణయం మార్చుకున్నారు. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయం తీసుకోవటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సిఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఎంఎల్ఏలకు పిలుపిచ్చారు.

 

రెండు వర్గాలుగా చీలిపోయిన ఏఐఏడిఎంకె పార్టీలో ప్రస్తుతం పన్నీర్ వర్గంలో 10 మంది ఎంఎల్ఏలు మాత్రమే ఉన్నారు. పళనికి మద్దతుగా 124 మంది శాసనసభ్యులున్నారు. అయితే, విశ్వాసపరీక్షలో నుండి గట్టెక్కాలంటే పళనికి 117 మంది ఎంఎల్ఏల మద్దతు అవసరం. గురువారం సిఎంగా ప్రమాణం చేసే సమయానికి 124 మంది ఎంఎల్ఏల మద్దతున్నప్పటికీ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. పళని వర్గంలో ఉండటానికి కొందరు ఎంఎల్ఏలు ఇష్టపడటం లేదని సమాచారం.

 

సుమారు 30 మంది ఎంఎల్ఏలకు శశికళ అంటే మంటగా ఉంది. జయలలిత జీవించి ఉన్నపుడు దూరంగా పెట్టిన దినకరన్, సెంగొట్టియన్ తదితరులను శశికళ కీలక స్ధానాల్లో నియమించారు. దాంతో పలువురు ఎంఎల్ఏల్లో అసంతృప్తి మొదలైంది. అది కాస్త పళనికి  ఎదురుతిరిగేదాకా వెళ్లింది. దాంతో బలపరీక్షలో ఎటువంటి పరిణామాలు చొటు చేసుకుంటాయో తెలీక శశికళ వర్గంలో ఆందోళన పెరిగిపోతోంది.

 

అయితే, విశ్వాస పరీక్ష అన్నది కేవలం ఏఐఏడిఎంకె అంతర్గత వ్యవహారంగా చెప్పిన డిఎంకె నేత స్టాలిన్ సాయంత్రానికి విశ్వాస పరీక్షలో తామూ పాల్గొంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా పళనికి వ్యతరేకంగా ఓటు వేయాలని కూడా నిర్ణయించినట్లు చెప్పటంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్టాలిన్ నిర్ణయంతో పళనికి వ్యతిరేకంగా సుమారు 108 ఓట్లున్నాయి. అనుకూలంగా ఎందరున్నారనే విషయంలో స్పష్టత లేదు. దాంతో పళని ప్రభుత్వానిది మూణ్ణాల ముచ్చటేనా అనే అనుమానాలు మొదలయ్యాయి.

 

click me!