
MLA Parthasarathy:ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. కొందరూ నాయకులు పార్టీని వీడి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే.. మరికొందరూ పార్టీలోనే ఉంటూ.. తమకు సరైన గుర్తింపు లేదంటూ ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి కూడా తన అసంతృప్తిని వెల్లడించారు. ప్రజల్లో తనకు ఆదరణ ఉన్నా.. పార్టీ అధినేత, సీఎం కనికరించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో వైసీపీ నిర్వహించిన సామాజిక సాధికార సభ వేదికగా వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తన అసంతృప్తిని బయటపెట్టారు. సీఎం జగన్ తనను పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే పార్ధసారధి అన్నారు. పెనమలూరు నియోజకవర్గంలో అన్ని కులాలు తనని ఆదరించినా సీఎం జగన్ మాత్రం తనని గుర్తించకపోవటం దురదృష్టకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవమానాలు ఎదురైనా.. ప్రజలే తనని కాపాడుతారంటూ స్పష్టం చేశారు.
తాను ఎమ్మెల్యేను కాదనీ, ప్రజలకు సేవకుడిగా ఉంటానని పార్థసారథి భావోద్వేగానికి లోనయ్యారు. తన జీవితాంతం తన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. గతంలో పామర్రు సభలోనూ ఎమ్మెల్యే పార్థసారధి తన అసంతృప్తిని వెల్లడించారు. తనకు సీటు వస్తుందో లేదోనని సంచలన కామెంట్ చేశారు. మరోవైపు పార్థసారధిని వేరే నియోజక వర్గానికి పంపే యోచనలో అధికార పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. కానీ అధిష్టాన నిర్ణయాన్ని పార్థసారధి వ్యతిరేకిస్తు వస్తున్నారట.