Pegasus spyware: ఏబీ వెంకటేశ్వర రావు వ్యాఖ్యలను తిప్పికొట్టిన అంబటి రాంబాబు.. ‘ఐపీఎస్‌ కాదు.. ఒక క్రిమినల్‌లా’

Published : Mar 21, 2022, 07:34 PM ISTUpdated : Mar 21, 2022, 07:50 PM IST
Pegasus spyware: ఏబీ వెంకటేశ్వర రావు వ్యాఖ్యలను తిప్పికొట్టిన అంబటి రాంబాబు.. ‘ఐపీఎస్‌ కాదు.. ఒక క్రిమినల్‌లా’

సారాంశం

పెగాసెస్‌ వ్యవహారంపై అసెంబ్లీలో చర్చ చేద్దాం అని నిర్ణయం తీసుకోగానే చంద్రబాబు నాయుడు.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో ప్రెస్ మీట్ పెట్టించి ఆరోపణల నుంచి తప్పించుకోవాలని చూశాడని వైసీపీ ఎమ్మెల్యే అంబటి అన్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా మీడియా ముందుకు రాకుండా.. అక్రమాలతో సస్పెన్షన్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావుతో ప్రెస్ మీట్ పెట్టించాడంటేనే.. వారు పెగాసెస్ వినియోగించారని అర్థం అవుతున్నదని ఆరోపించారు.  

అమరావతి: వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను తిప్పికొట్టారు. పెగాసెస్ వివాదంపై ఏబీ వెంకటేశ్వరరావు మాటలను కొట్టిపారేశారు. ఎన్నో అక్రమాల ఆరోపణలతో సస్పెన్షన్‌లో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడారని ఆరోపణలు చేశారు. అక్రమాలు, అభియోగాలతో సస్పెన్షన్‌లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారితో చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టించాడంటేనే.. ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిన స్పైవేర్ పెగాసెస్‌ను ఆ ప్రభుత్వం ఉపయోగించినట్టే అర్థం అవుతుందని అన్నారు.

మమతా బెనర్జీ వ్యాఖ్యలతో చంద్రబాబు నాయుడు పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశాడన్న విషయం బయటకు వచ్చిందని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు పెడదాం అని నిర్ణయానికి వచ్చామని అంబటి తెలిపారు. అసెంబ్లీలో చర్చకు పెడదామని అనుకోగానే.. చంద్రబాబు నాయుడు.. ఏబీ వెంకటేశ్వరరావుతో ప్రెస్ మీట్ పెట్టించాడని అంబటి అన్నారు.

ఏబీ వెంకటేశ్వరరావు దుర్మార్గమైన వ్యక్తి అని, ఎన్ని పంచాయితీలు పెట్టాడని అంబటి ఆరోపించారు. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారినప్పుడు.. మంత్రి పదవులు ఇచ్చినప్పుడు డబ్బులు మోసిన వ్యక్తివి నీవు కాదా? అంటూ ప్రశ్నించారు. ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు పబ్లిక్ సర్వెంట్‌గా పని చేయలేదని, చంద్రబాబు నాయుడు సర్వెంట్‌గా చేశారని ఆరోపించారు. అసలు ఒక ఐపీఎస్ అధికారివి కాదు.. నువ్వు ఒక క్రిమినల్‌గా ప్రవర్తించావు అని ఆరోపణలు చేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడూ ఖాకీ డ్రెస్ వేసుకోకుండా పసుపు రంగు డ్రెస్ వేసుకున్నావని మేం ఎప్పుడో చెప్పామని తెలిపారు.

తాను ఒక ఐపీఎస్ అధికారి అని ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నాడని, ఒక ఐపీఎస్ అధికారి ఇలా మాట్లాడవచ్చా? ఒక పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకోని మాట్లాడతారా? అని ప్రశ్నించారు. ఔను.. ఆయన సస్పెన్షన్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి అని, డిస్మిస్ కాలేదని, కాబట్టి ఆయన ఇప్పటికీ ప్రభుత్వ ఉద్యోగే అని తెలిపారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినా ఐపీఎస్ అధికారి ప్రభుత్వ అనుమతి లేకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చునా? అని అడిగారు. సస్పెన్షన్‌లో ఉండి టీడీపీని కాపాడటం కోసం ఎందుకు పని చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయన ప్రజల కోసం, జాతీయ ప్రయోజనాల కోసం పని చేయడం లేదని అన్నారు.

చంద్రబాబు నాయుడుకు, ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య ఉన్న సంబంధాలు ప్రజలకు తెలియనిది కావని అంబటి అన్నారు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ ఆ పార్టీ కోసం ఎందరినో బెదిరించాడని, ఎన్నో అక్రమాలకు ఏబీ వెంకటేశ్వరరావు పాల్పడ్డాడని ఆరోపించారు. ఇవాళ పెగాసెస్ వ్యవహారం ముందుకు రాగానే.. తమ నాయకుడికి ఏమో జరిగిపోతున్నదని ఆగమేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టాడని అన్నారు. అదే ప్రెస్ మీట్.. ఒక ప్రెస్ క్లబ్‌లో ఎందుకు పెట్టారు? మీరు నేరుగా ఎన్టీఆర్ భవన్‌లో పెట్టుకోవచ్చుగా.. దానికి ఎవరి అభ్యంతరం ఉండదు కదా? అని ఎద్దేవా చేశారు.

అంబటి రాంబాబు, సాక్షి మీడియా.. ఇంకా కొందరిపై పరువు నష్టం దావా వేస్తానని ఆయన బెదిరించాడని అంబటి గుర్తు చేశారు. తాను అలాంటి బెదిరింపులకు భయపడనని, తాము రాజకీయాల్లో ఉన్నామని, అలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu