ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలిస్తే.. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోతుంది. పయ్యావుల ఓడిపోతే టీడీపీ గెలుస్తుంది.' అన్న సెంటిమెంట్ ఈసారి బ్రేక్ అయింది.
అనంతపురం జిల్లా ఉరవకొండలో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాదు అనే సెంటిమెంట్ ఉంది. మరి ఈసారి ఏమైంది. సెంటిమెంట్ నిజమైందా..? బ్రేక్ అయిందా..?
ఆంధ్రప్రదేశ్‌లో సెంటిమెంట్ బ్రేక్ అయింది. అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ విజయం సాధించారు. అత్యధిక స్థానాల్లో గెలిచి తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అయితే, 'ఉరవకొండలో పయ్యావుల కేశవ్ గెలిస్తే.. రాష్ట్రంలో టీడీపీ ఓడిపోతుంది. పయ్యావుల ఓడిపోతే టీడీపీ గెలుస్తుంది.' అన్న సెంటిమెంట్ ఈసారి బ్రేక్ అయింది.
ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ప్రత్యేక పరిస్ధితులకు వేదిక. భూస్వాములకు ఈ నియోజకవర్గం కేంద్రం. వ్యవసాయంతో పాటు చేనేత రంగంపై ఉరవకొండలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో నేతన్నలు ఉపాధి లేక వలసపోతున్నారు. 1962లో ఏర్పడిన ఉరవకొండ నియోజకవర్గంలో విడపనకల్, వజ్రకరూర్, ఉరవకొండ, బెలుగుప్ప, కూడేరు మండలాలున్నాయి.
ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,15,741 మంది. కాంగ్రెస్, టీడీపీలకు ఉరవకొండ కంచుకోట. కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, టీడీపీ ఆరుసార్లు, స్వతంత్రులు రెండు సార్లు, వైసీపీ ఒకసారి విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి పయ్యావుల కేశవ్‌కు 90,209 ఓట్లు.. వైసీపీ అభ్యర్ధి వై విశ్వేశ్వర్ రెడ్డికి 88,077 ఓట్లు పోలయ్యాయి. 2,132 ఓట్ల తేడాతో పయ్యావుల విజయం సాధించారు. మరోసారి వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డిపై పయ్యావుల విజయం సాధించారు.