కాల్వ శ్రీనివాసులపై వ్యాఖ్యలు.. జేసీ ప్రభాకర్ రెడ్డికి పయ్యావుల కౌంటర్

By Siva KodatiFirst Published Sep 12, 2021, 6:58 PM IST
Highlights

రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం పేరిట నిన్న అనంతపురం కమ్మ భవనంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల సంగతి తర్వాత... ముందు పార్టీ కార్యకర్తల సంగతి చూడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 

రాయలసీమ ప్రాంత నీటి సమస్యలపై శనివారం టీడీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ సమావేశంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పయ్యావుల కేశవ్ స్పందించారు. మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులును ఉద్దేశించి జేసీ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. పార్టీని బలహీన పరిచే విధంగా వ్యవహరించడం సరైన పంథా కాదని హితవు పలికారు. వ్యక్తిగత విభేదాలు ఉంటే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని పయ్యావుల సూచించారు.

అటు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందిస్తూ... కాలవ శ్రీనివాసులు వివాదరహితుడని, ఆయనపై వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమని పేర్కొన్నారు. అసలు, జేసీ కుటుంబమే టీడీపీకి సమస్య అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన దౌర్జన్యాలపై తాము పోరాటం చేశామని ప్రభాకర్ చౌదరి గుర్తుచేశారు. జేసీ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు.

Also Read:సీమలో ప్రాజెక్ట్‌లు కాదు.. ముందు టీడీపీ కార్యకర్తలను కాపాడండి: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనం

రాయలసీమ ప్రాజెక్టుల భవితవ్యం పేరిట నిన్న అనంతపురం కమ్మ భవనంలో టీడీపీ నేతలు సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ, సాగునీటి ప్రాజెక్టుల సంగతి తర్వాత... ముందు పార్టీ కార్యకర్తల సంగతి చూడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశానికి అందరినీ ఎందుకు పిలవలేదు... ఇదంతా చూస్తుంటే ఇద్దరు నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తున్నట్టుంది అని వ్యాఖ్యానించారు.

అనంతపురం పార్లమెంటు స్థానం టీడీపీ ఇన్‌ఛార్జీ కాలవ శ్రీనివాసులు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, పార్టీ నేతలు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

click me!