వేగం పెంచిన పవన్

First Published Nov 4, 2017, 5:30 PM IST
Highlights
  • పార్టీకి సేవలందించడానికి సమన్వయకర్తలను నియమించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
  • ఈ నియామకాలు రెండు రాష్ట్రాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకునే చేస్తారు.

పార్టీకి సేవలందించడానికి సమన్వయకర్తలను నియమించాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఈ నియామకాలు రెండు రాష్ట్రాల్లోని పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో పెట్టుకునే చేస్తారు.  జనసేన ఔత్సాహక శిబిరాలను ఏర్పాటు చేసినప్పుడు సుమారు 65 వేల దరఖాస్తులు వచ్చాయి.     ఇందులో నుండి సుమారు 8 వేలమందిని ఎంపిక చేసారు. వీరందరినీ  జనసేన ఔత్సాహిక శిబిరాలలో పాల్గొనేందుకు ఆహ్వానించారు.

పార్టీ పరిపాలన కార్యాలయం నుండి వీరందరికీ సమాచారం కూడా వెళ్ళింది.  పార్టీకి సమన్వయకర్తలుగా సేవలు అందించడానికి వీరిలో ఎంతమంది సిద్ధంగా వున్నారో నిర్ధారించుకున్నాక పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసిన తర్వాతే సమన్వయకర్తలను నియమించాలని పవన్ అనుకుంటున్నారు.  ఈ సమావేశాలు ఈ నెల ఆరో తేదీ నుంచి మొదలవుతాయి. తోలి విడత లో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. డిసెంబర్ ఏడో తేదీకి సమావేశాలు ముగించాలని పవన్ అనుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాలలో ఉన్న 42 పార్లమెంట్ స్థానాలకు గాను ప్రతీ నియోజకవర్గానికి 20 మంది చొప్పున అంటే 840 మందిని ఎంపిక చేస్తారు. సమన్వయకర్తల నియామకానికి పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి, తెలంగాణ ఇంచార్జి శంకర్ గౌడ్, పార్టీ మీడియా హెడ్ హరి ప్రసాద్, సేవాదళ్ కోఆర్డినేటర్ రియాజ్, పార్టీ ప్రతినిధి నగేష్ తదితరులు జిల్లాల్లో పర్యటిస్తారు. ఎంపికైన సమన్వయకర్తలకు హైదరాబాద్ లో శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శిక్షణ శిబిరానికి ముందు జనసేన అధినేత  వీరందరి తో సమావేశమవుతారు.

పార్టీ స్థానిక నియామకాల్లో ఇది తొలి అడుగుగా భావించవచ్చు. పార్టీకి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి పార్టీ నిర్వహణలో భాగస్వామ్యం కల్పించడానికి పార్టీ అధ్యక్షుడు మరిన్ని నియామకాలను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. సమన్వయ కర్తలకు శిక్షణ ఇచ్చిన తరువాత స్పీకర్లు, ఎనలిస్టులు , కంటెంట్ రైటర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. మొత్తం మీద ముందస్తు ఎన్నికల వాతావరణానికి అనుగుణంగానే పవన్ కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లే కనబడుతోంది.

 

click me!