హోదాపై పవన్ ఆంతర్యమేమిటి ?

First Published Jan 31, 2017, 1:06 AM IST
Highlights

హోదాపై ఎవరితోనూ కలవకుండా ఒంటరి పోరాటం చేద్దామనుకుంటున్నారా లేక ప్రతిపక్షాలతో కలిసి ఐక్య ఉద్యమం చేయాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సిన సమయమైతే వచ్చింది.

 

ప్రత్యేకహోదాపై పవన్ ఆంతర్యమేమిటో అర్ధం కావటం లేదు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా రాదని ఎప్పుడో తేలిపోయిన పవన్ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న దాఖలాల్లేవు. ఎప్పుడో ఓసారి ట్విట్టర్లో స్పందించటం తప్ప క్షేత్రస్ధాయిలో కార్యాచరణకు దిగింది ఎక్కడ? జల్లికట్టు నేపధ్యంలో మొన్న పవన్ చేసింది అదేకదా? దాంతో పవన్ మనసులో ఏముందో ఎవరికీ ఓ పట్టాన అర్ధం కావటం లేదు.

 

ప్రత్యేకహోదాపై వెంకయ్యనాయడు, చంద్రబాబు, సుజనాచౌదరి తదితరులు ఎప్పటికప్పుడు ఎవరికీ అర్ధంకాని రీతిలో స్పందించారు. ప్రధానమంత్రి హోదా ఇవ్వరని తేలిపోయినపుడు మళ్ళీ వారే ప్లేటును ఫిరాయించారు. దాంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. అదే సమయంలో ప్రత్యేకహోదాపై కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తున్న సమయం నుండే  వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆందోళనలు మొదలుపెట్టారు. హోదా డిమాండ్ తో దీక్షలు చేసారు. రాష్ట్రవ్యాప్తంగా యువతతో పలు సమావేశాలు కూడా నిర్వహించారు.

 

అంటే హోదాకు వ్యతిరేకంగా చంద్రబాబు, అనుకూలంగా జగన్ తమ స్టాండ్ ను స్పష్టం చేసారు. దాంతో ప్రతిపక్షాలు కూడా హోదాకు మద్దతు ప్రకటించాయి. అయితే జనసేన అధ్యక్షుడు పవన్ మాత్రం అర్ధంకాని రీతిలో స్పందించారు. హోదా ఇవ్వటం సాధ్యం కాదని చెప్పిన కేంద్రంపైన కేంద్రం ముందు సాగిలపడిన చంద్రబాబుపైన మాత్రం పవన్ ఈగ వాలనివ్వటం లేదు. అదేసమయంలో హోదా విషయంలో ఎటువంటి సంబంధం లేని వెంకయ్య తదితరులపైన మాత్రం విరుచుకుపడుతున్నారు.   

 

హోదాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పార్టీలనూ ఏమనకుండా, మద్దతుగా పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షాలతోనూ కలవకుండా పవన్  ఏం చేద్దామనుకుంటున్నారో? హొదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న జగన్ తో పవన్ చేతులు కలపటం లేదు. మొన్నటికి మొన్న రాష్ట్రవ్యాప్తంగా 26వ తేదీన నిరసనలు తెలపాలంటూ ట్విట్టర్లో మోతెక్కించిన పవన్ ఆ రోజు అసలు అడ్రస్పే లేరు.

 

తాజాగా హోదా కోసం పోరాటం చేయాలని చెబుతున్న పవన్ ఇప్పటికే పోరాటాలు చేస్తున్న ప్రతిపక్షాలతో ఎందుకు చేతులు కలపకూడదనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. జనసేనకు ఇప్పటి వరకూ రంగు, రుచి, వాసన అంటూ ఏవీ లేవు. కనబడుతున్నదంతా ఒక్క పవన్ మాత్రమే. ప్రతిపక్షాలకేమో క్షేత్రస్ధాయిలో కమిటీలున్నాయి, కార్యకర్తలున్నారు. హోదాపై ఎవరితోనూ కలవకుండా ఒంటరి పోరాటం చేద్దామనుకుంటున్నారా లేక ప్రతిపక్షాలతో కలిసి ఐక్య ఉద్యమం చేయాలా అన్న విషయంలో స్పష్టత రావాల్సిన సమయమైతే వచ్చింది. ఇప్పటికే తమతో కలిసి ఉద్యమాలు చేయాలని పవన్ను వామపక్షాలు ఆహ్వానించాయి. సిసిఐ-పవన్ మధ్య చర్చలు కూడా జరిగాయి.  ప్రతిపక్షాలతో కలిసి ఉద్యమాలు చేసే విషయంలో పవన్ స్పష్టత ఇస్తే తదుపరి కార్యాచరణ ఏమిటన్నది కాలమే తేలుస్తుంది.

 

 

click me!