ఈ విషయాలు మరిచిపోకండి.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి: జనసేన శ్రేణులను అలర్ట్ చేసిన పవన్

Published : Apr 24, 2023, 05:07 PM IST
ఈ విషయాలు మరిచిపోకండి.. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి: జనసేన శ్రేణులను అలర్ట్ చేసిన పవన్

సారాంశం

జనసేన నాయకులు, వీర మహిళలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న తమ దృష్టి మళ్లించడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని పవన్ లేఖలో పేర్కొన్నారు.

జనసేన నాయకులు, వీర మహిళలకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ లేఖ రాశారు. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తున్న తమ దృష్టి మళ్లించడానికి, తమ భావజాలాన్ని కలుషితం చేయడానికి కొన్ని శక్తులు నిరంతరం పని చేస్తున్నాయని పవన్ లేఖలో పేర్కొన్నారు. వాటిని పార్టీ శ్రేణులు అర్థం చేసుకోవాలని కోరారు. జనసేన  నాయకులు మాట్లాడే ముందు పలు విషయాలు గుర్తుంచుకోవాలని సూచించారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరిపైనా ఆర్ధిక నేరారోపణలు చేయకూడదని సూచించారు.  కేవలం మీడియాలో వచ్చిందనో లేదా ఎవరో మాట్లాడారనో నిర్ధారణ కానీ అంశాల గురించి మాట్లాడవద్దని కోరారు.  

పొత్తుల గురించి సామాజిక మాధ్యమాల్లో వచ్చే సమాచారం ఆధారంగా మాట్లాడవద్దని.. ఈ విషయంలో మేలు చేసే నిర్ణయం తానే స్వయంగా తీసుకుంటానని స్పష్టం చేశారు. తమతో సయోధ్యగా ఉన్న రాజకీయ పక్షాలలో చిన్న చితక నాయకులు తమపై ఏమైనా విమర్శలు చేస్తే ఆ విమర్శలు ఆ నాయకుని వ్యక్తిగతమైన విమర్శలుగా భావించాలని సూచించారు. వాటిని ఆయా పార్టీలకు ఆపాదించవద్దని చెప్పారు. 

‘‘మనకు సానుకూలంగా ఉన్న రాజకీయ పక్షాలు, నాయకులకు మన పార్టీ పట్ల ఉన్న సానుకూల దృక్పథాన్ని దెబ్బ తీసే కల్పిత సమాచారాన్ని మన శ్రేణులకు చేర్చే కుట్రలకు పాల్పడుతున్నట్లు మన వద్ద విశ్వసనీయ సమాచారం ఉంది. అందువల్ల పార్టీలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తీవ్రమైన ప్రతి విమర్శలు, తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ముందుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ దృష్టికి తీసుకువెళ్ళండి. వారి సూచనలు, సలహా మేరకు మీరు మాట్లాడండి.

పార్టీలోని నాయకులు, వీర మహిళలు, జన సైనికులు మాట్లాడే ప్రతి మాట పార్టీపై ప్రభావం చూపుతుంది. అందుకే నిత్యం అప్రమత్తంగా ఉండాలి. మాట్లాడే ముందు వాస్తవాలు నిర్ధారించుకోవాలి. స్థాయి, తీవ్రత హద్దులు దాటినట్లు సభ్య సమాజం భావించని విధంగా మన మాటలు ఉండాలి. ఒక వ్యక్తి గురించి మాట్లాడే సమయంలో అకారణంగా వారి కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావించవద్దు. ఆధారాలు లేకుండా నేరారోపణలు చేయకండి. అది పార్టీకి, సమాజానికి కూడా హితం కాదు. నన్ను విమర్శించే వారికీ, వ్యక్తిగతంగా దూషించే వారికి బదులు చెప్పే సమయంలో నేను చాలా అప్రమత్తంగా ఉంటానన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రతి అక్షరాన్ని, ప్రతి మాటను బేరీజు వేసుకుంటూ హద్దులు దాటకుండానే కొంత తగ్గి బదులు చెబుతాను. ఎందుకంటే మన నుంచి వచ్చే ప్రతీ మాటకు అంత బలం ఉంటుంది. ఆ బలం అపసవ్యంగా మారకూడదు’’ అని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Minister Kolusu Parthasarathy serious on Bhumana Karunakar Reddy | TDP VS YCP | Asianet News Telugu
విజయవాడ సంక్రాంతి వేడుకల్లో MP Kesineni Sivanath | Sankranthi Muggulu | Asianet News Telugu