
Pawan Kalyan warns: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. అమరావతి రాజధాని ప్రాంతం, రాజధాని అభివృద్ధికి భూములు ఇచ్చిన మహిళలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
సాక్షి టీవీ ఛానెల్‌లో జర్నలిస్ట్ వి.వి.ఆర్. కృష్ణం రాజు, యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు చేసిన అనుచిత వ్యాఖ్యలు రాజకీయంగా ప్రేరేపితమైనవి. పక్కా ప్రణాళికతో అమలైన కుట్రలో భాగమని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.
“మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఆయన మీడియా వ్యవస్థలు ఏ ఉద్దేశాలతో పనిచేస్తున్నాయో ప్రజలు అర్థం చేసుకోవాలి” అని పవన్ పిలుపునిచ్చారు. రాజధానిపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఒక వ్యక్తిగత అభిప్రాయంగా భావించరాదని పేర్కొన్నారు.
కృష్ణం రాజు వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలుగా చెప్పి సాక్షి టీవీ బాధ్యత తప్పించుకోవడం సరైన చర్య కాదని పవన్ స్పష్టం చేశారు. "రాజధాని ప్రాంతాన్ని అవమానించేందుకు జరిగిన ఈ ప్రయత్నాలు ఆక్షేపణీయమైనవి" అని ఆయన అన్నారు.
అమరావతి ప్రాంతానికి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. మౌర్యులు, ఇక్ష్వాకులు కాలంనాటి శాసనాలు ఈ ప్రాంతం ప్రాచీనతను వివరిస్తున్నాయన్నారు. చైనాకు చెందిన పర్యటకుడు హ్యూయెన్ సాంగ్ ఈ ప్రాంతాన్ని బౌద్ధం వికసించిన కేంద్రంగా పేర్కొన్నారు. అలాగే ఆచార్య నాగార్జున ఇక్కడ ఉన్నారని వివరించారు.
“ఈ స్థలానికి సంబంధించిన చారిత్రక అంశాలు తెలిసినవారు ఎలా ఇలాంటి అనవసర వ్యాఖ్యలు చేయగలరు?” అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అమరావతి అభివృద్ధికి భూములు ఇచ్చిన ప్రజల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం కూడా ఆయన వివరించారు. అందులో 32% మంది ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందినవారు, 14% బీసీలు, 20% రెడ్లు, 18% కమ్మ వర్గానికి చెందినవారు, 9% కాపులు, 3% ముస్లింలు ఉన్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు.
ఈ భూములిచ్చిన మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావనీ, మహిళల గౌరవాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. పవన్ కామెంట్స్ తో త్వరలోనే అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్న దానిపై చర్చ సాగుతోంది.