విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మారేందుకు ప్రోత్సాహం: డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌

By Galam Venkata Rao  |  First Published Aug 26, 2024, 12:32 PM IST

విద్యార్థులను శాస్త్రవేత్తలుగా మార్చేందుకు అవసరమైన ప్రోత్సాహం అందిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచడం, స్పేస్ పార్క్ ఏర్పాటు లాంటి కార్యక్రమాల ద్వారా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.


అంతరిక్ష పరిశోధన ఫలాలను సక్రమంగా వినియోగించుకుంటే దేశం అభివృద్ధి పథంలో మరింత ముందుకెళ్తుందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించడం అవసరమని చెప్పారు. శాస్త్రవేత్తలుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. రష్యాకు చెందిన వ్యోమగామి సెర్గి కోర్సకొవ్, స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి నివాసంలో  ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు చేసిన పరిశోధనలు, తయారు చేసిన శాటిలైట్ల గురించి వివరించారు. ఇటీవల తయారు చేసిన అతిచిన్న శాటిలైట్ డిప్లయర్‌ను చూపించి.. దాని పనితనాన్ని వివరించారు.

Latest Videos

undefined

ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటుపై చర్చ  

అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు ఆసక్తి పెంచాలంటే ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని  స్పేస్ కిడ్జి ఇండియా వ్యవస్థాపకురాలు, సీఈవో డాక్టర్‌ కేశన్ కోరారు. స్పేస్ పార్క్ నాసాలో మాత్రమే ఉందని, మన దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తే విద్యార్థులకు అంతరిక్ష రంగంపై మరింత అవగాహన పెంచవచ్చన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు.     

ఆరు నెలలపాటు అంతరిక్షంలో...

ఈ సందర్భంగా వ్యోమగామి సెర్గి కోర్సకొవ్‌ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సత్కరించారు. చంద్రయాన్- 3 రాకెట్ నమూనాను బహుకరించారు. సెర్గి కోర్సకోవ్‌ ఆరు నెలలపాటు అంతరిక్షంలో ఉన్నారు. అక్కడి విశేషాలను, అంతకాలం ఏ విధంగా ఉండగలిగారు..? అక్కడ పరిశోధించిన అంశాల గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తిగా తెలుసుకున్నారు. ఆయన కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రష్యన్ వంటకాలను రుచి చూపించారు.

 

click me!