కాలినడకన ఇప్పటం చేరుకున్న పవన్.. కూల్చేసిన ఇళ్ల పరిశీలన.. ఇడుపులపాయలో హైవే వేస్తామని వైసీపీకి హెచ్చరిక..

By Sumanth KanukulaFirst Published Nov 5, 2022, 10:34 AM IST
Highlights

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. రోడ్ల విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో అధికారులు ఇళ్లు కూల్చివేసిన నిర్వాసితులకు సంఘీభావం తెలుపుతున్నారు.

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఇప్పటం గ్రామంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారు. రోడ్ల విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో అధికారులు ఇళ్లు కూల్చివేసిన నిర్వాసితులకు సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పటంలో కూల్చివేసిన ఇళ్లను పరిశీలిస్తున్న పవన్ కల్యాణ్.. నిర్వాసితులకు తాము ఉన్నామనే భరోసా కల్పిస్తున్నారు. ఇళ్ల కూల్చివేతకు గురైన నిర్వాసితులు కూడా పవన్ కల్యాణ్ వద్ద వారి బాధను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. పీవీ నర్సింహారావు, ఇందిరా గాంధీ, మహాత్మ గాంధీ విగ్రహాలను కూడా కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు విస్తరణ చేసేందుకు ఇదేమైనా కాకినాడానా?, రాజమండ్రినా? అని ప్రశ్నించారు. పెదకాకానిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఇంటి ముందు విస్తరణ వర్తించదా అని ప్రశ్నించారు. 

మార్చి నెలలో జనసేన సభకు భూములు ఇచ్చిన కారణంగానే వీళ్ల మీద కక్ష కట్టి ఏప్రిల్ నెలలో కూల్చివేత నోటీసులు ఇచ్చారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. వైసీపీ గుండాలు ఇలాగే చేస్తే.. తాము ఇడుపులపాయలో హైవే వేస్తామని హెచ్చరించారు. గుంతలు పూడ్చలేరు, రోడ్లు వేయలేరు.. కానీ రోడ్ల  విస్తరణ కావాలా అని ప్రశ్నించారు. సిగ్గుందా ఈ ప్రభుత్వానికి అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేన శ్రేణులు ధర్నాలు చేయాలని.. కానీ పోలీసులపై చేయి వేయవద్దని సూచించారు. అయితే ఆగకుండా చేతులు కట్టుకుని ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పోలీసులు కూడా సమస్యలు ఉన్నాయని అన్నారు.  వైఎస్సార్ విగ్రహాం ఉంచి.. జాతీయ నాయకుల విగ్రహాలు కూల్చడమేమిటని ప్రశ్నించారు. బీఆర్ అంబేడ్కర్ కంటే రాజశేఖరరెడ్డి ఎక్కువ అని ప్రశ్నించారు. పులివెందుల తరహా రాజకీయం ఇక్కడ చేస్తే నడవదని బలంగా చెప్పమని ప్రజలకు సూచించారు. 

పవన్ కల్యాణ్ ఇప్పటంలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటం పరిసరాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక,  ఇప్పటంలో పర్యటించేందుకు పవన్ కల్యాణ్ శుక్రవారం రాత్రి మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరకున్నారు. శనివారం ఉదయం ఇప్పటం వెళ్లడానికి బయలుదేరిన పవన్ కల్యాణ్‌ను మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ముందు పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇప్పటం వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తెలుపడంతో.. పవన్ కల్యాణ్ తన వాహనం దిగి నడుచుకుంటూ ఇప్పటం చేరుకున్నారు. 

ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్‌ సభకు భూములు ఇచ్చిన కారణంగానే అధికార పార్టీ ఇప్పటంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని జనసేనతోపాటు విపక్షాలన్ని మండిపడ్డాయి. ఇప్పటం గ్రామం వద్ద రోడ్డుపై అంతగా ట్రాఫిక్ లేదని జనసేన పేర్కొంది. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న రోడ్డు 70 అడుగుల వెడల్పుతో ఉందని.. కానీ ప్రభుత్వం అకస్మాత్తుగా 70 అడుగుల నుంచి 120 అడుగులకు పెంచుతూ నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. గత  అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటు వేయని వారి ఇళ్లను తొలగించారని విమర్శించారు. ఎన్నికలు. రోడ్డుపై ఉన్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ను అధికారులు ముట్టుకోలేదని.. కానీ ప్రజల ఇళ్లను మాత్రం కూల్చివేశారని మండిపడ్డారు. ఇళ్ల కూల్చివేతకు గురైనా నిర్వాసితులకు భరోసా కల్పించేందుకు ఇప్పటంలో పవన్ కల్యాణ్ పర్యటిస్తున్నారని జనసేన పేర్కొంది. 

ఇకపోతే... మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్ధ ఆధ్వర్యంలో ఇప్పటంలో చేపట్టిన రోడ్డువిస్తరణ పనులు ఉద్రిక్తంగా మారాయి. తమ ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ బాధితులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగగా వారికి టిడిపి, జనసేన నాయకులు మద్దతు తెలిపారు. తమకు తగిన పరిహారం చెల్లించి న్యాయం చేసాకే ఇళ్ల తొలగించాలంటూ కూల్చివేత పనులను అడ్డుకునే ప్రయత్నం చేసారు. అయితే పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన చేపట్టినవారిని అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలపై పలువురు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే విధించడంతో కూల్చివేతలు నిలిపివేశారు అధికారులు. ఇప్పటికే రోడ్డుకు ఒకవైపు కూల్చివేతలు పూర్తయ్యాయి.

click me!