జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ఉత్తరాంధ్ర నుండి ప్రారంభం కానుంది.
అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మూడో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఈ విషయమై పార్టీ నేతలతో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. విశాఖపట్టణం జిల్లా నుండి ప్రారంభించనున్న మూడో విడత వారాహి యాత్రపై పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చిస్తున్నారు.
ఈ ఏడాది జూన్ 14న కత్తిపూడి జంక్షన్ వద్ద వారాహి యాత్ర ప్రారంభమైంది. జూన్ 30న భీమవరంలో ఈ యాత్ర ముగిసింది. ఈ ఏడాది జూలై 9న ఏలూరులో వారాహి యాత్ర రెండో విడతను పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. అదే నెల 14వ తేదీన ఈ యాత్రను తణుకులో ముగించారు పవన్ కళ్యాణ్. మూడో విడత వారాహి యాత్రను పవన్ కళ్యాణ్ చేపట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇవాళ పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చిస్తున్నారు. వారాహి యాత్ర రూట్ మ్యాప్ తో పాటు ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలపై చర్చిస్తున్నారు. వారాహి యాత్రలో ఏ రకమైన అంశాలను యాత్రలో ప్రస్తావించాలనే దానిపై పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చిస్తున్నారు.
రెండో విడత వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.ఈ వ్యాఖ్యలను ఏపీ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ఈ వ్యాఖ్యలపై కోర్టులో కూడ ఫిర్యాదు చేసింది.
మూడో విడత వారాహి యాత్ర ఉత్తరాంధ్రలో ప్రారంభం కానుంది. గత ఎన్నికల్లో విశాఖపట్టణంలోని గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఉభయ గోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర పూర్తి చేసిన తర్వాత ఉత్తరాంధ్రపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ రోజు నుండి యాత్రను ప్రారంభించాలనే దానిపై పార్టీ నేతలతో నాదెండ్ల మనోహర్ చర్చిస్తున్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రాకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ గతంలో పదే పదే ప్రకటించారు. ఈ దిశగా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.