విశాఖలో మోదీతో భేటీ కానున్న పవన్ కల్యాణ్.. ఆ విషయాలపై క్లారిటీ రానుందా..?

By Sumanth KanukulaFirst Published Nov 11, 2022, 11:21 AM IST
Highlights

విశాఖపట్నం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. ప్రస్తుతం ఏపీలో  నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీలో మోదీతో పవన్ ఏం చర్చించనున్నారనే ఆసక్తి సర్వత్ర నెలకొంది.

విశాఖపట్నం పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలవనున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి వైజాగ్‌లో అందుబాటులో ఉండాలని ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్‌ కాల్‌ అందుకున్న పవన్‌ కల్యాణ్ ప్రత్యేక విమానంలో రానున్నారు. మోదీతో పవన్ సమావేశం ఉంటుందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. అయితే వీరిద్దరి భేటీ ఈరోజు రాత్రి 8.30 గంటలకు జరుగుతుందని చెబుతున్నారు. అయితే ఈ రోజు ఏపీ బీజేపీ కోర్ కమిటీ నేతల సమావేశం జరగనున్న నేపథ్యంలో.. మోదీతో పవన్ భేటీ ఈ రోజు రాత్రి జరుగుతుందా..?, శనివారం ఉదయం జరుగుతుందా..? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది. 

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత చోటుచేసుకుంది. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీపి కూటమికి పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబులు కలిసి సభలలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి ఏపీలో అధికారంలో వచ్చింది. అయితే 2019కి వచ్చేసరికి ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. మరోవైపు ఏపీ అభివృద్ది విషయంలో టీడీపీ, బీజేపీ తీరును పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. టీడీపీకి 23 స్థానాలు, జనసేన ఒకచోట విజయం సాధించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. 2020 జనవరిలో ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టకుంటున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. 

అయితే రెండు పార్టీల పొత్తులో ఉన్నామని చెప్పుకోవడం తప్ప.. ఆ మేరకు ఇరు పార్టీల నాయకుల మధ్య సంబంధాలు ఉన్నట్టుగా కనిపించదు. కొందరు ఏపీ బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌ను ప్రశంసిస్తే.. మరికొందరు తాము ఆయనకు దూరమనే సంకేతాలు పంపుతుంటారు. అయితే 2019లో భారీ విజయంతో వైసీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు అయిన తరుణంలో.. జనసేన, టీడీపీలు ఆ పార్టీపై విమర్శల దాడిని పెంచుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వైసీపీపై విమర్శలు చేసేందుకు వెనకాడటం లేదు. అయితే పవన్ కల్యాణ్ కనబరుస్తున్న దూకుడు మాత్రం బీజేపీ నేతల్లో కనిపించడం లేదనే చెప్పాలి. ఇప్పటికీ ఏపీ బీజేపీలో కొందరు నేతలు.. అధికార వైసీపీపై మెతక వైఖరి ప్రదర్శిస్తారనే టాక్ రాజకీయవర్గాల్లో ఉంది. 

అయితే ఏపీలో కొన్ని నెలలుగా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు చిగురించనుందనే ప్రచారం సాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతు.. త్యాగాలకు సిద్దంగా ఉన్నామని ప్రకటించిన తర్వాత ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా జగన్‌ను సింగిల్‌గా ఎదుర్కొవడానికి రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వస్తాయనే.. దమ్ముంటే ఒంటిరిగా రావాలనే సవాళ్లు విసురుతున్నారు. అయితే టీడీపీ, జనసేన పార్టీల అగ్ర నాయకత్వం పొత్తులపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకపోవడంతో.. ఇరు పార్టీల క్యాడర్‌లో అయోమయం నెలకొంది. 

ఇదిలా ఉంటే ఇటీవల పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు  ఒక్కసారిగా వేడేక్కాయి. విజయవాడలో పవవన్ కల్యాణ్‌ను వద్దకు వెళ్లి చంద్రబాబు కలిసిన అనంతరం.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అన్ని రాజకీయ పార్టీలు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఇది పొత్తుల గురించి కాదని.. ఇరు పార్టీల నేతల స్పష్టం చేశారు. 

మరోవైపు తమకు బీజేపీతో పొత్తు ఉందని ప్రకటించిన పవన్ కల్యాణ్.. ఆ పార్టీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు బీజేపీ నాయకుల నుంచి రోడ్ మ్యాప్ అందడం లేదని చెప్పిన పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర రాజకీయ ముఖాచిత్రం మారబోతుందని చెప్పారు. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ ఎక్కడో బలంగా పనిచేయలేకపోతున్నామని చెప్పారు. మోదీ అంటే గౌరవం అని.. అలా అని తన స్థాయిని తాను చంపుకోనని చెప్పారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ గురించి తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పిన పవన్ కల్యాణ్.. కార్మికులు కూడా కలిసివస్తేనే అది సాధ్యపడుతుందని అన్నారు. 

ఈ క్రమంలోనే స్పందించిన బీజేపీ నేతలు ఏపీలో తమ పొత్తు జనసేనతో ఉందని స్పష్టం చేశారు. అయితే తాము టీడీపీతో  మాత్రం కలవబోమని కొందరు నేతలు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తీరుపై ఆ  పార్టీలోకి కొందరు నేతలు విమర్శలు చేయడం మరింత హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఏపీ బీజేపీలోని కొందరు నేతలు టీడీపీకి అనుకూల వైఖరిని ప్రదర్శించడం.. మరికొందరు వైసీపీ అనుకూల వైఖరి ప్రదర్శించడం రాష్ట్రంలో ఆ పార్టీకి నష్టం కలిగించే అంశమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ పరిణామాల నేపథ్యంలో చాలా కాలం తర్వాత ప్రధాని మోదీతో పవన్ కల్యాణ్.. వన్ టూ వన్ భేటీ కావడం ప్రాధాన్యత చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించడంతో పాటు.. పొత్తుల విషయంలో పవన్ ఓ కార్లిటీ తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అలాగే రాష్ట్రంలోని కొందరు బీజేపీ నాయకుల తీరును కూడా పవన్.. మోదీ దృష్టికి తీసుకెళ్లనున్నారనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ప్రధాని రోడ్డు మ్యాప్‌పై, పొత్తులపై ఏమైనా క్లారిటీ ఇస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. ఏపీ రాజధాని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాలపై మోదీతో పవన్ చర్చిస్తారా? లేదా? అనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. 

అయితే ఈ భేటీలో పొత్తులపైనే ప్రధానంగా చర్చ జరగనుందనే ప్రచారం సాగుతుంది. జనసేన, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడమా?, జనసేన ఒంటరిగా ఎన్నికల బరిలో దిగడమా? లేకుంటే.. 2014 ఫార్ములాను మళ్లీ రిపిటీ చేస్తుందా? అనే విషయంలో మోదీతో పవన్ భేటీ  తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ నేతలకు కూడా ప్రధాని మోదీ పలు విషయాల్లో మార్గనిర్దేశనం చేయనున్నట్టుగా తెలుస్తోంది. 

click me!