
పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటనకు వెళ్తున్నారు. ఒక సమస్య మీద ఒక ప్రాంతం పర్యటించక చాలా రోజులంది. గతంలో ఆయన రాజధాని ప్రాంత రైతుల భూములను ప్రభుత్వం లాక్కోరాదని చెబుతూ ఉండవల్లి ప్రాంతంలో పర్యటించారు.
అంతే, తర్వాత ఆయన పర్యటనలు ,సమావేశాలు చాలా సాగినా , ఒక ప్రత్యేక సమస్య కోసం ఏ ప్రాంతం తిరగలేదు. ఇపుడు జనవరి 3 వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో అంతుచిక్కని మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు.
హైదరాబాద్ నుంచి నేరుగా రెండో తేదీ సాయంత్రం విశాఖ చేరుకుంటారు. నోవాటెల్ హోటల్ లో బస చేస్తారు. మరుసటి రోజు . మరుసటి రోజు విశాఖ నుంచి రోడ్డు మార్గాన ఇచ్ఛాపురం పట్టణం చేరుకుంటారు.అక్కడ ఉద్ధానం కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న కుటుంబాలతో సమావేశమవుతారు. ఈ సమావేశానికి మిడియాను మాత్రమే అనుమతిస్తున్నారు.
నవంబర్ నెలలోనే ఆయన ఇక్కడి రావలసి ఉండింది. అయితే, నోట్ల రద్దు పరిణామాల మధ్య ఆయన ఈ పర్యటన వాయిదా వేసుకున్నారు. కంచిలి,కవిటి, సోంపేట, మందస, వజ్రపు కొత్తూరు,పలాసలను కలిపి ఉద్ధానం అనిపిలుస్తారు. ఉద్దానం అనగానే రెండు విషయాలు, ఒక టి ఆహ్లాదం, రెండోది విషాదం గుర్తుకొస్తాయి. కోనసీమంత ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతంలో ప్రజలు మూత్ర పిండాల వ్యాధితో నరకయాతన అనుభవిస్తున్నారు. ఈసమస్యకు పరిష్కారం దొరకక, వైద్యానికయ్యే ఖర్చుల భారం మోయలేక కుటుంబాలెన్నో పతనమవుతున్నాయి.
ఎన్నో పేరు మోసిన విశ్వవిద్యాలయాలు ఈ సమస్యను అధ్యయనం చేశాయి. నెదర్లాండ్ వంటి దేశాలు అర్ధిక సహ యం అందించాయి. అయినా, ప్రజలకు ముక్తి దొరకలేదు.
ఇంత అభివృద్ధి సాధించామని చెప్పుకునే ప్రభుత్వాలు ఈ వేదన నుంచి కుటుంబాలను కాపాడలేకపోవడం విచారకరం.
పవన్ కల్యాణ్ ఈ సమస్య లోతుపాతులు బాధితుల నుంచే తెలుసుకునేందుకు రావడం ప్రశంసనీయం. అయితే, ఆయన దీనిని 2019 ఎన్నికల వాగ్దానానికి పనికొచ్చే అంశంగా కాకుండా తక్షణం ఉపశమనం కలిపించాల్సిన సమస్యగా చూసి ప్రభుత్వం మీద వత్తిడి తీసుకువచ్చి ఉచిత చికిత్స సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది.