
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సిఎం పాల్గొన్న బహిరంగ సభలో వైసీపీ ఎంఎల్ఏ మాట్లాడటం ఎవరైనా, ఎప్పుడైనా చూసారా? ముచ్చుమర్రి బహిరంగ సభలో అదే జరిగింది. ప్రతిపక్ష శాసనసభ్యుడు సిఎం సమక్షంలో మాట్లాడటం ఇదే మొదటి సారి. అలాగే, ప్రతిపక్ష ఎంఎల్ఏను వేదికపైకి పిలిచి మాట్లాడించటం కూడా ఇదే తొలిసారి.
ఆ సందర్భంగానే వారిరువురి మధ్య ఆశక్తికరమైన సంభాషణ జరిగింది. అదేంటంటే పథకానికి పునాది వేయటం గొప్పా? ప్రారంభించంటం గొప్పా? రెండింటిలో ఏది ముఖ్యం. ఈ విషయమై ఇద్దరి మధ్యా జరిగిన సంవాదాన్ని సభికులు, ప్రజలు ఆసక్తిగా గమనించారు.
కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని సిఎం ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆ ఘటన చోటు చేసుకుంది.
వేదికపైకి నియోజకవర్గం వైసీపీ ఎంఎల్ఏ ఏసయ్యను పిలిచారు. వేదిక మీద నుండి రాజకీయం చేయవద్దని, ప్రజలకు శుభాకాంక్షలు చెప్పమని సిఎం ఎంఎల్ఏకు మైక్ ఇచ్చారు.
అపుడు ఏసయ్య మాట్లాడుతూ సిఎం చేతుల మీదగా పథకం ప్రారంభమవటం సంతోషంగా ఉందన్నారు. అలా అంటూనే, అసలు ఈ పథకానికి శంకుస్ధాపన వేసి పనులు మొదలుపెట్టింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డే అంటూ బాంబు పేల్చారు.
తాను పాల్గొన్న సభలో వైఎస్ ఆర్ ప్రస్తావన రావటంతో చంద్రబాబు ఖంగుతిన్నారు. వేదిక మీద వైసీపీ ఎంఎల్ఏని పిలవటంతో పాటు మాట్లాడే అవకాశం ఇవ్వటం కూడా ఇదే మొదటిసారనుకుంటే, సదరు ఎంఎల్ఏ ఏకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డినే కీర్తించటాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోయారు. వెంటనే ఏసయ్యను చంద్రబాబు గద్ధించారు.
రాజకీయాలు చేయవద్దని, రాజకీయాలు చేయాలంటే తానూ చాలా చేస్తానన్నారు. పునాదులు చాలామంది వేసి వెళ్ళిపోతారని, కానీ డబ్బులు మంజూరు చేసి పథకాన్ని పూర్తిచేయటమే ముఖ్యమన్నారు. అంటూనే ‘తమ్ముళ్ళూ మీరే చెప్పండి..పథకాన్ని ఎవరు పూర్తిచేసారం’టూ ప్రజలను ప్రశ్నించారు.
ఏసయ్య ఇంకేదో మాట్లాడబోతే నిర్వాహకులు మైక్ కట్ చేసి వేదికపై నుండి తీసుకెళ్లిపోయారు.