కాపు కోటాపై పవన్ కల్యాణ్ వైఖరి: అది ముద్రగడ ప్లాన్?

By pratap reddyFirst Published Aug 14, 2018, 2:19 PM IST
Highlights

పవన్ కల్యాణ్ కొత్తగా ఏదైనా ప్రకటించారా అని చూస్తే అందులో కొత్తదనమేదీ లేదు. కాపులకు రిజర్వేషన్లు సాధించడానికి అవసరమైన నిర్దిష్ట ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచారణ ఏదీ లేదు.

అమరావతి: కాపు రిజర్వేషన్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వైఖరిని స్పష్టం చేశారు. నిజానికి, ఆయకు ఇది చాలా కష్టమైన విషయమే. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కల్యాణ్ ఆ సామాజిక వర్గానికి చెందిన వారి డిమాండుపై ఎలా స్పందిస్తారోనని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఆసక్తికి పవన్ కల్యాణ్ సోమవారంనాడు తెర దించారు. 

అయితే, పవన్ కల్యాణ్ కొత్తగా ఏదైనా ప్రకటించారా అని చూస్తే అందులో కొత్తదనమేదీ లేదు. కాపులకు రిజర్వేషన్లు సాధించడానికి అవసరమైన నిర్దిష్ట ప్రణాళిక, భవిష్యత్తు కార్యాచారణ ఏదీ లేదు. అది కేంద్రం చేతిలో ఉన్న విషయం. వాటిని సాధించడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. కానీ ఏ విధమైన ఒత్తిడి పెడుతారనేది చెప్పలేదు. 

రిజర్వేషన్లు యాభై శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు కచ్చితమై ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా రిజర్వేషన్లు కల్పించేది లేదని కేంద్ర ప్రభుత్వం కూడా అంతే కచ్చితంగా చెప్పింది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ లో చేర్చాలని కోరింది. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించుతోంది కాబట్టి కాపుల రిజర్వేషన్లు అమలు కావడానికి దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. అందుకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం సిద్దంగా లేదని ఇప్పటికే స్పష్టమైంది. 

దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం డిమాండ్లు పెరుగుతూ వస్తున్నాయి, ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ఒక్కసారి ఒక్కరికి అనుమతి ఇస్తే అది దాంతో అగదనే విషయం అందరికీ తెలుసు. తెలంగాణ ముస్లింలకు రిజర్వేషన్లు అమలు చేయడానికి 9వ షెడ్యూల్ లో చేర్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కూడా కేంద్రాన్ని కోరారు.

అదనపు రిజర్వేషన్ల కల్పన అనేది కేంద్రం చేతుల్లో ఉంది, కేంద్రం 9వ షెడ్యూల్లో చేర్చి అదనపు రిజర్వేషన్ల కల్పనకు సిద్ధంగా లేదు. ఇటువంటి పరిస్థితిలో అటు తెలంగాణలో ముస్లింలకు, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి లేదు. అందువల్లనే కాపు రిజర్వేషన్లను అమలు చేయలేనని, అది తన చేతుల్లో లేదు కాబట్టి తన వల్ల కాదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఒక రకంగా ఆ ప్రకటన చాలా సాహసోపేతమైందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ బలమైన సామాజిక వర్గం ఓట్లు జారీపోయే ప్రమాదం ఉందని తెలిసి కూడా జగన్ ఆ ప్రకటన చేశారు. 

పవన్ కల్యాణ్ చంద్రబాబు చెప్పిన విషయాన్ని చెప్పారు. అంతకు మించి అందులో ఏమీ లేదు. అయితే, ఇందులో ఉన్న తిరకాసు అంతా కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వ్యూహంలో ఉంది. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం తొలుత జగన్ కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించారు. జగన్ కూడా ముద్రగడ ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. కానీ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో అడుగు పెట్టిన తర్వాత ముద్రగడ వైఖరి మారినట్లు కనిపిస్తోంది.

కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటనను ఆయన వ్యతిరేకించారు. చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం లేదు. ప్రస్తుతం ఆయన పవన్ కల్యాణ్ కు అండగా నిలబడడానికి సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. ముద్రగడ వ్యూహరచనలో భాగంగానే పవన్ కల్యాణ్ కాపు రిజర్వేషన్లపై ప్రకటన చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

తాను, తన అనుయాయులు పవన్ కల్యాణ్ ను సమర్థించడానికి అవసరమైన ఓ ప్రాతిపదికను ముద్రగడ ఏర్పాటు చేసుకున్నారని అనుకోవాలి. సోషలిస్టు మేధావి తుర్లపాటి సత్యనారాయణ అంచనా ప్రకారం - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం తర్వాత అధికారం కాపు సామాజిక వర్గానికి దక్కుతుంది. కులమే సామాజిక, రాజకీయ సత్యమని విశ్వసించి ఆయన ఆ అంచనాకు వచ్చారు. కాబట్టి, కాపు సామాజిక వర్గానికి అధికారాన్ని దక్కించుకునే సందర్భం వచ్చిందని కూడా వారు భావిస్తుండవచ్చు. సోషలిస్టు మేధావి రామ్ మనోహర్ లోహియా అంచనా కూడా అదే. బ్రాహ్మణుల ఆధిపత్యం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కొన్ని దశాబ్దాల పాటు రెడ్ల రాజకీయాధికారం ఉంటుందని, ఆ తర్వాత కాపులూ దాని ఉప కులాల వారు అనేక సామాజిక, ఆర్థిక, జనాభా కారణాల వల్ల రాజ్యాధికారంలోకి వచ్చే అవకాశం ఉందని లోహియా అంచనా వేశారు.

అయితే, కమ్మలకు అధికారం వస్తుందని లోహియా ఊహించలేదు. అయితే, సినీ గ్లామర్ వల్లనే కాకుండా రాజకీయ శూన్యతలో దూకుడు రావడం వల్ల కూడా ఎన్టీఆర్ అధికారంలోకి రావడంతో లోహియా అంచనా తప్పింది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకు తెలుగుదేశం పార్టీపై కుల ముద్ర పడింది. ఈ స్థితిలో కాపు సామాజిక వర్గం అధికారం చేజిక్కించుకోవడానికి తగిన వాతావరణం ఏర్పడిందనే భావన మేధావుల్లో వ్యక్తమవుతోంది.

ఈ నేపథ్యంలోనే ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ పవన్ కల్యాణ్ కు అండగా నిలవాలని నిర్ణయించుకుని ఉంటారని అంటున్నారు.  పవన్ కల్యాణ్ ప్రకటన ఆయనను సమర్థించడానికి ముద్రగడకు తగిన ప్రాతిపదికను ఏర్పాటు చేసింది. మొత్తం మీద, కర్ర విరగకుండా పాము చావకుండా కాపు రిజర్వేషన్లపై పవన్ కల్యాణ్ వైఖరి ఉందనే అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.  

click me!