
తుని: ప్రమాదంలో తన అభిమాని మరణంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ శోకతప్తుడయ్యారు. శోకసముద్రంలో ఉన్న అభిమాని కుటుంబాన్నిచూసి ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. తునిలో విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన కార్యకర్త శివ కుటుంబాన్ని పవన్ కల్యాణ్ శుక్రవారంనాడు పరామర్శించారు.
శివ కుటుంబానికి పవన్ కల్యాణ్ తక్షణ సాయంగా 3 లక్షలు రూపాయలు అందించారు. శివ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. శివ మూడు నెలల బిడ్డకు అనిరుధ్ అని నామకరణం చేశారు. ఆ చిన్నారిని తన ఒళ్లో పెట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు.
పాయకరావుపేటలో మంగళవారం అర్ధరాత్రి పవన్‌కల్యాణ్ అభిమానులు ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మరణించారు.
ప్రజాపోరాట యాత్రలో భాగంగా జనసేన అధినేత గురువారం పాయకరావుపేట వస్తున్నట్లు తెలుసుకున్న ఆయన అభిమానులు పట్టణంలోని సూర్యమహల్ సెంటర్‌లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. వాటికి ఉన్న ఇనుప చట్రం పైన వున్న విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో భీమవరపు శివ (28), తోళెం నాగరాజు(30) షాక్ కొట్టి మరమించారు.
పాయకరావుపేట పట్టణానికి చెందిన శివ కూరగాయల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య విజయలక్ష్మి, మూడు నెలల కుమారుడు ఉన్నారు. తండ్రి వెంకటరమణ, తల్లి కాంతం అనారోగ్యంతో ఏ పనీ చేయలేని స్థితిలో ఉన్నారు.