జగన్ తో నాకు వ్యక్తిగత కక్షలేదు. మేం కక్ష సాధింపులకు పాల్పడబోం. రాష్ట్రంలో 175 స్థానాల్లో గెలిచినంత బాధ్యతతో పనిచేస్తాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఘన విజయం అనంతరం పవన్ కల్యాణ్ ఇంకా ఏమన్నారంటే....
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిల్లో జనసేన పోటీ చేసిన 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. రాష్ట్రంలో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లోనూ జయకేతనం ఎగురవేసింది. పదేళ్ల నిరీక్షణ తర్వాత తిరుగులేని విజయం సాధించింది. ఈ సందర్భంగా జనసేన విజయంపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసైనికులతో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీ చేసి గెలిచింది 22 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లోనే అయినా... 175 సీట్లూ తామే గెలిచామన్న బాధ్యతతో పనిచేస్తామని తెలిపారు. యువత, ఆడబిడ్డలు, సగటు ప్రజలు గడిచిన ఐదేళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ తాను గుర్తుపెట్టుకుంటానన్నారు. ఏరు దాటి తెప్ప తగలేసే వ్యక్తిని తాను కాదని.. అన్ని వర్గాలకు మంచి చేసేలా తమ ప్రభుత్వం జవాబుదారీగా పనిచేస్తుందని చెప్పారు. ఉద్యోగులు, నిరుద్యోగులకిచ్చిన హామీలు నెరవేరుస్తామని... ఏడాదిలోకి సీపీఎస్ రద్దు చేస్తామని నెరవేరుస్తామని తెలిపారు. జగన్‌తో తనకు వ్యక్తిగత కక్ష లేదని.. కక్ష సాధింపులకు పాల్పడబోమని స్పష్టం చేశారు.
‘‘గెలుపు తనకు బాధ్యతనిచ్చిందే కానీ అహంకారమివ్వలేదు. అందరూ శుభాకాంక్షలు చెబుతుంటే భయమేసింది. ఇళ్లు అలకగానే పండగ కాదు. భీమవరం, గాజువాక రెండూ ఓడిపోయినప్పుడు నన్ను నమ్ముకున్న కొద్దిమంది తప్ప ఎవరూ లేరు. కానీ ఓటమి నాకు ఉత్సాహమిచ్చింది. పిఠాపురంలో గెలిపించిన కనిపించని దేవుళ్లందరికీ, ఆకాశమంత విజయాన్నిచ్చిన పిఠాపురం ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగుదేశం ఇంచార్జి వర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు. పిఠాపురం ప్రజలు పవన్‌ను గెలిపించలేదు.. రాష్ట్రంలో ఐదు కోట్ల మందిని గెలిపించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలెబెట్టుకుంటాం. కష్టాల్లో మీ ఇంట్లో ఒకడిగా ఉంటా'' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.’’