పవన్ కళ్యాణ్‌ వినూత్న కార్యక్రమం... త్వరలో ‘టీ విత్ డిప్యూటీ సీఎం’

By Galam Venkata Rao  |  First Published Jul 11, 2024, 8:29 AM IST

అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో జూ పార్కుల అభివృద్ధికి నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం లాంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు.


ఆంధ్రప్రదేశ్‌లో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఉన్న జూ పార్కులకు ఎక్కువ మంది పర్యటకులను ఆకర్షించేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రాష్ట్రంలో నూతన జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. మంగళగిరిలోని తన నివాసంలో జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ 14వ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని జూ పార్కుల నిర్వహణ, ఆదాయ వ్యయాల వివరాలను పవన్ కళ్యాణ్‌కు అధికారులు వివరించారు. జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గౌరవ ఛైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూ పార్కులు, పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.  

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో జూ పార్కులను అభివృద్ధి చేయాలని, పర్యావరణహిత కార్యక్రమాలతో పర్యటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని సూచించారు. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధానంలో జూ పార్కుల అభివృద్ధికి నిధులు సమకూర్చడం, అరుదైన ఆకర్షణీయంగా ఉండే జంతువులను దిగుమతి చేసుకోవడం లాంటి అంశాల మీద దృష్టి సారించాలని ఆదేశించారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా వన్యప్రాణుల సందర్శనతో చక్కటి అనుభూతులు (వైల్డ్ లైఫ్ ఎక్స్ పీరియన్స్) కలిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. జూ పార్కుల అభివృద్ధిలో కార్పోరేట్లను భాగస్వాముల్ని చేయాలని, పరిశ్రమల సీఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం, అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం లాంటి కార్యాచరణలు రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు తిరుపతి, విశాఖ పర్యటనల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. అవసరమైతే పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను జంతు ప్రదర్శనశాలల అభివృద్ధిలో పాలుపంచుకొనేలా చేసేందుకు ఉపముఖ్యమంత్రితో తేనీటి సేవనం (టీ విత్ డిప్యూటీ సీఎం) అనే కార్యక్రమాన్ని రూపొందించాలని ఆదేశించారు. 

Latest Videos

అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జంతు ప్రదర్శనశాలల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించి, జోన్ల వారిగా జూపార్కుల ఏర్పాటు అంశంపై నివేదిక రూపొందించాలని అధికారులకు పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. పర్యాటకం, పర్యావరణహిత పర్యాటక అభివృద్ధికి సంబంధించిన నమూనాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేద్దామని చెప్పారు.

click me!