మరోసారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు యాక్షన్ లోకి దిగారు. రాష్ట్రంలో పెట్టుబడుల కోసం పాారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు.
అమరావతి :ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యాక్షన్ లోకి దిగారు. రాష్ట్ర అభివృద్దిలో భాగంగా పెట్టుబడులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ప్రముఖ కంపనీలు బిపీసీఎల్, విన్ ఫాస్ట్ ప్రతినిధుల సీఎం భేటీ అయ్యారు. సచివాలయంలో ఈ సంస్థల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఈ సందర్భంగా పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో గల అనుకూలతలను కంపనీల ప్రతినిధులకు వివరించారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడులకు ముందుకువస్తే అన్ని సదుపాయాలు కల్పించేందుకు సిద్దంగా వున్నామన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానంగా చంద్రబాబు పేర్కొన్నారు.
undefined
రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ,పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు బిపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ సిద్దమైనట్లు... సీఎం చంద్రబాబు కూడా ఆయన అన్నిరకాల సహాయ సహయకారాలు అందించేందుకు సిద్దంగా వున్నట్లు హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది.
చంద్రబాబు నాయుడు ఇటీవల దేశ రాజధాని డిల్లీ పర్యటన సందర్భంలో కేంద్ర పెద్దలతో బీపీసీఎల్ పెట్టుబడులపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా నేడు బిపీసీఎల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు 4-5 వేల ఎకరాలు అవసరం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే కంపనీ ఏర్పాటుకు అవసరమైన భూములు కేటాయిస్తామని... 90 రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన పూర్తి ప్రణాళికతో రావాలని కంపనీ ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. అక్టోబర్ నాటికి ఫీజిబిలిటీ రిపోర్ట్ తో వస్తామని బిపీసీఎల్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
అనంతరం విన్ ఫాస్ట్ ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో వియత్నాంలో పేరున్న సంస్థ. ఈ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ తో పాటు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం ఆ సంస్థ ప్రతినిధులకు వివరించారు.
ఈవీ, బ్యాటరీ తయారీ ప్లాంట్ ను ఏపీలో నెలకొల్పాలని చంద్రబాబు వారిని కోరారు. ప్లాంట్ కు అవసరమైన భూమి, ఇతర మౌళిక సదుపాయాల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున అన్ని విధాలా సహకరిస్తామని...పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కోరారు.