ఏపీకి బడ్జెట్‌లో ప్రాధాన్యం పవన్ కళ్యాణ్ చలువే..: ఎంపీ బాలశౌరి

By Galam Venkata Rao  |  First Published Jul 23, 2024, 8:29 PM IST

మోదీ 3.0 బడ్జెట్‌పై ఎంపీ బాలశౌరి ప్రశంసలు కురిపించారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి పెద్దపీట వేయడంలో పవన్ కళ్యాణ్‌ చొరవ ఎంతో ఉందని కొనియాడారు. అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు మద్దతు, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీలు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు.


కేంద్రంలో మూడోసారి కొలువుదీరిన నరేంద్ర మోదీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను పార్లమెంటును ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు సముచిత కేటాయింపులు జరపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి స్పందించారు. ఈ బడ్జెట్ అభివృద్ధికి సూచికగా ఉందని ప్రశంసించారు. 

కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దపీట వేయడం పట్ల బాలశౌరి సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రంలో NDA ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి విజయభేరి మోగించడంలో కీలక పాత్ర పోషించిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ చొరవతోనే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన్యం దక్కిందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి కట్టుబడి రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.15 వేల కోట్లు కేటాయించడమే కాకుండా, అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని అదనపు నిధులు ఇస్తామని చెప్పడం, అమరావతి నిర్మాణం కోసం బహుళ సంస్థల ద్వారా నిధులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం శుభపరిణామం అన్నారు. అలాగే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసేందుకు సంపూర్ణంగా సహకరిస్తామనడం ఎంతో బాగుందన్నారు. అదేవిధంగా రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలోని వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి నిధులు, పూర్వోదయ పథకం ద్వారా ప్రత్యేక ప్రాజెక్టులు, పారిశ్రామిక కేంద్రాలుగా కొప్పర్తి, ఓర్వకల్లు అభివృద్ధికి, నీరు, విధ్యుత్, రోడ్, రైల్వే ప్రాజెక్టులకు దశలవారీగా నిధులు కేటాయిస్తామనడాన్ని స్వాగతించారు. ముద్ర రుణాల పెంపు, ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్‌ఫుడ్ హబ్‌ల ఏర్పాటు, ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులకు ప్రోత్సాహం, కోటి మంది యువతకు ఇంటెర్న్ షిప్, టూరిజం అభివృద్ధి తదితర ప్రకటనలపై ఎంపీ బాలశౌరి హర్షం వ్యక్తలం చేశారు. అలాగే, మహిళల కోసం బంగారం, వెండిపై దిగుమతి సుంకం తగ్గింపు, మొబైల్ ఫోన్లు, పరికరాలపై కస్టమ్స్ సుంకం తగ్గింపు మొదలైనవి ప్రజలకు మేలు చేస్తాయని పేర్కొన్నారు.

Latest Videos

కేంద్రంలో ఎన్‌డీయే ప్రభుత్వం ఏర్పడటానికి, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అరాచక పాలన నుంచి విముక్తి కల్పించి...  అనుభజ్ఞుడు, దార్శినికుడైన చంద్రబాబు  నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన కారకులైన జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌కు ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరీ ధన్యవాదాలు తెలిపారు. నరేంద్ర మోడి నాయకత్వంలో దేశం మరింత ప్రగతి సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

click me!