మోదీని చంద్రబాబు రూ.లక్ష కోట్లు అడిగారు.. మరి ఎంత సాధించారు?

By Galam Venkata RaoFirst Published Jul 23, 2024, 3:21 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రాజధాని అమరావతి సహా కీలక ప్రాజెక్టులకు బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇటీవల ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసిన చంద్రబాబు.. ఏపీ అభివృద్ధికి నిధులు కేటాయించాలని అడిగారు. మరి ఎంత మేరకు డిమాండ్లు సాధించుకోగలిగారు..?

అప్పులు, ఆర్థిక ఇబ్బందులుతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్‌కు కాస్త ఉపశమనం కలిగించే ప్రకటనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర విడిపోయి పదేళ్లు గడిచినా సరైన రాజధాని లేని పరిస్థితుల్లో కీలక భరోసా ఇచ్చింది. తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి దోహద పడే పలు వరాలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం 13 జిల్లాలతో సరైన రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్రప్రదేశ్‌ మిగిలిపోయింది. పదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ప్రకటించినప్పటికీ చంద్రబాబు ముందుగా ఏపీకి ప్రభుత్వాన్ని, పాలనా యంత్రాంగాన్ని తరలించారు. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య 33వేల ఎకరాల్లో రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలా, 2014 నుంచి 2019 వరకు అమరావతిలో పలు కీలక ప్రాజెక్టుల శంకుస్థాపనలు, అభివృద్ధి పనులను పరుగులు పెట్టించారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ముఖ్యమంత్రి, ఇతర ప్రజాప్రతినిధుల కార్యాలయ భవనాల నిర్మాణం పూర్తిచేశారు. ఉద్యోగులకు సంబంధించిన భవనాల నిర్మాణమూ చేపట్టారు. అయితే, 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోవడంతో జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాటి నుంచి అమరావతిలో ఒక్క ఇటుక కూడా కదల్లేదు. 

Latest Videos

తాజాగా, 2024 ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అధికారంలోకి రావడమే తొలుత అమరావతే ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అని ప్రకటించారు. ప్రధాని మోదీ సహా కేంద్ర పెద్దలు భేటీ అయి.. అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించాలని విన్నవించారు. అలాగే, రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలతో పాటు ఇతర ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని కోరారు. 

కేంద్రంలోని మోదీ 3.0 ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన చంద్రబాబు మాట నెగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిగేలా కృషి చేశారు. ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయం అందించనున్నట్లు తాజా బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా రామన్‌ ప్రకటించారు. అలాగే, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దాంతో పాటు విభజన చట్టంలోని అంశాలకు అనుగుణంగా ఏపీలోకి ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తామన్నారు. 

మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి, కొన్నేళ్లు అసంపూర్తిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు పెద్దపీట వేస్తామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. విభజన చట్టానికి లోబడి వీలైనంత త్వరగా పూర్తిచేసేందకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న మరో డిమాండ్‌ను కూడా పచ్చ జెండా ఊపింది. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు ప్రకాశం జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయిస్తామన్నారు.

అలాగే, ఆంధ్రప్రదేశ్‌ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం... రాష్ట్రంలో పారిశ్ర ప్రగతికి ప్రత్యేక సహకారం అందిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. విశాఖ- చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ నోడ్‌లకు ప్రత్యేక సాయంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు మౌలిక సదుపాయాలు (నీళ్లు, విద్యుత్‌, రోడ్లు, హైవేలు) అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని నిర్మలమ్మ ప్రకటించారు.

కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌‌కి ప్రత్యేక ప్రాధాన్యం దక్కడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలియజేశారు.

click me!