చంద్రబాబు చెప్పేదే నిజం ... జగన్ చెప్పేదంతా అబద్దమే..: వైఎస్ షర్మిల 

By Arun Kumar PFirst Published Jul 22, 2024, 8:35 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తన సొంత సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ షర్మిల మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు నాయుడు చెప్పేదే నిజం... జగన్ చెప్పేదంతా అబద్దం అనేలా షర్మిల కామెంట్స్ చేసారు. ఇంతకూ షర్మిల దేనిగురించి మాట్లాడారంటే...

YS Jagan vs Sharmila : అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి... వైసిపి అధికారాన్ని కోల్పోయింది... వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు... ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అయినా సొంత సోదరుడిని వైఎస్ షర్మిల విడిచిపెట్టడం లేదు. ప్రతిపక్షంలోనూ ఆయన వుండటం షర్మిలకు నచ్చినట్లు లేదు... అన్న పొలిటికల్ కెరీర్ నే నాశనం చేయాలి అన్నది ఆమె లక్ష్యంగా పెట్టుకున్నట్లున్నారు. తాజాగా వైఎస్ షర్మిల చంద్రబాబు సర్కార్ కంటే ఎక్కువగా తన అన్ననే టార్గెట్ గా చేసారు. 

గత ఎన్నికల్లో వైఎస్ జగన్ పార్టీ 151 అసెంబ్లీ, 23 లోక్ సభ స్థానాల్లో ఘన విజయం సాధించగా... ఈసారి మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది. వై నాట్ 175 అన్న వైఎస్ జగన్ కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యాడంటే అందెంత ఘోర పరాజయమో అర్థం చేసుకోవచ్చు. ఈ  స్థాయి ఓటమికి కొన్ని స్వయంకృతాపరాధాలు కారణం కాగా... ప్రత్యర్థులు చంద్రబాబు నాయడు, పవన్ కల్యాణ్ లతో పాటు సొంత చెల్లి వైఎస్ షర్మిల మరో కారణం. తాను గెలవకున్నా పర్వాలేదు కానీ అన్న మాత్రం మళ్లీ అధికారంలోకి రాకూడదు అన్నంత కసితో ఆమె పనిచేసారు. లోపాయికారిగా చంద్రబాబు కోసం ఆమె పనిచేసారనే ప్రచారం కూడా వుంది. ఇందులో నిజమెంతో తెలీదుగానీ షర్మిల అనుకున్నదే జరిగింది... అన్న చిత్తుగా ఓడిపోయారు.  

Latest Videos

ప్రతిపక్షానికి పరిమితమైన వైఎస్ జగన్ అధికార టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ఏపీలో శాంతిభద్రతల అంశాన్ని ఎజెండాగా తీసుకుని చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. టిడిపి ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తోంది... ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తోందంటూ ప్రజల్లోకి వెళుతున్నారు. కానీ ఈ ప్రయత్నాలను కూడా షర్మిల అడ్డుపడుతున్నారు. తాజాగా వినుకొండ హత్య విషయంలో జగన్ చేసిందంతా రాజకీయమేనంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. 

వినుకొండలో వైసిపి నాయకుడిని రాజకీయ హత్యే అంటూ వైఎస్ జగన్ చేసిన కామెంట్స్ కు షర్మిల కౌంటర్ ఇచ్చారు.  ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవు... ఇది వ్యక్తిగత వివాదాల వల్ల జరిగిన హత్యేనని షర్మిల పేర్కొన్నారు. తమ విచారణలో ఇది ముమ్మాటికీ వ్యక్తిగత గొడవే అని తేలిందన్నారు. కానీ తన రాజకీయాల కోసం దీన్ని పొలిటికల్ మర్డర్ గా జగన్ కలరింగ్ ఇచ్చారంటూ షర్మిల ఎద్దేవా చేసారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి... ప్రజలు వరదలతో అల్లాడిపోతున్నారు... ఇలాంటి సమయంలో డిల్లీకి వెళ్లి ఏం చేస్తారు? అంటూ అన్నను నిలదీసారు షర్మిల. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతోంది...ఇందులో పాల్గొని ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సింది పోయి డిల్లీకి వెళ్లడమేంటి? అని ప్రశ్నించారు. ఇప్పటికే చితికిపోయిన రైతులను ఈ వరదలు మరింత నష్టాల్లోకి నెట్టాయి... వారికి అండగా నిలవాలని షర్మిల సూచించారు. 

గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు జరిగిన మేలేమీ లేదన్నారు షర్మిల.  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో వ్యవసాయం పండగలా వుంటే ఆయన వారసుడిగా చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్ వ్యవసాయానికి చేసిందేమీ లేదన్నారు. రైతు పక్షపాతి వైఎస్సార్ అన్నదాతల సంక్షేమానికే పెద్దపీట వేసారు...కానీ జగన్ అలా కాదన్నారు. వైఎస్సార్ తలపెట్టిన జలయజ్ఞంను జగన్ పూర్తిగా విస్మరించారని అన్నారు. కొత్త ప్రాజెక్టులు కట్టడంమాట అటుంచి ఉన్నవాటికి కనీసం మరమత్తులు చేయలేదన్నారు. 

రైతులకు సబ్సిడీ ఇచ్చే పథకాలను ఎత్తేశాడు... ధరల స్థిరీకరణ నిధి అంటూ మోసం చేసాడని అన్నారు. ఇలా వైఎస్ జగన్ హయాంలో చితికిపోయిన రైతులక ఇప్పుడు పడుతున్న వర్షాలు మరింత భారాన్ని మోపాయంటూ షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటికే అప్పులపాలైన రైతాంగాన్ని ఈ వర్షాలు మరింత నష్టాన్ని మిగిల్చాయన్నారు. వర్షాలకు వేసిన పంటలు మునిగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో రైతాంగం వున్నారని షర్మిల అన్నారు. ఇలాంటి రైతులను ఇప్పుడు కూటమి సర్కార్ ఆదుకోవాలని... ఆర్థికసాయం చేయాలని కోరారు. తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా రైతుల రుణాలను మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేసారు. 

 వైఎస్ జగన్ కు హత్యా, గొడ్డలి రాజకీయాలు తప్పితే ఏం తెలియవని షర్మిల అన్నారు. హత్యలు చేసిన వారితో భుజాలు రాసుకుని తిరిగారన్నారు. సొంత చెల్లెల్లకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్ అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేసారు. 


 

click me!