
ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేసేసి, వారిలో ధైర్యం నింపేందుకు జనసేస అధినేత పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్రకు శ్రీకారం చుట్టారు. అనంతపురం జిల్లాను రైతు భరోసా యాత్రను పవన్ కల్యాణ్ నేడు ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించడంతో పాటుగా.. వారికి ఆర్థిక సాయం అందజేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ ఈ రోజు ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌కు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పవన్ తొలుత కొత్త చెరువు గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ ఇటీవల సాగునష్టం, ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున లక్ష రూపాయలు ఆర్ధిక సాయాన్ని రామకష్ణ భార్య సాకే సుజాతకు అందజేశారు. రామకృష్ణ చనిపోయిన తరువాత తమ కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోలేదని సుజాత ఈ సందర్బంగా పవన్‌కు తెలిపింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలోనే స్పందించిన పవన్ కల్యాణ్.. జనసేన పార్టీ తరఫున అన్ని రకాలుగా కుటుంబానికి అండగా ఉంటామని పవన్ భరోసా ఇచ్చారు. ఈ రైతు భరోసా యాత్రలో పవన్ కల్యాణ్‌తో పాటు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు.
అనంతరం పవన్.. ధర్మవరంలోని మరో బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఇక, అనంతపురంలో 28 మంది కౌలురైతు కుటుంబాలకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించనున్నట్లు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.