విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి.. కేంద్ర మంత్రి ప్రకటన హర్షనీయం: పవన్ కల్యాణ్

Published : Apr 13, 2023, 05:53 PM IST
విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి.. కేంద్ర మంత్రి ప్రకటన హర్షనీయం: పవన్ కల్యాణ్

సారాంశం

విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో, ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తుచేశారు. 

విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 32 మంది ప్రాణ త్యాగాలతో, ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటైందని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయడం లేదని కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే చేసిన వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదని.. ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదని చేసిన ప్రకటన హర్షణీయమని అన్నారు. కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపిందని  చెప్పారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విశాఖ ఉక్కును కాపాడాలనే చిత్తశుద్ధి లేదని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు తాను ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశానని.. వారు సానుకూలంగానే స్పందించారని తెలిపారు. ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిందని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియజేసి.. ప్రత్యేకంగా చూడాలని కోరడం జరిగిందన్నారు. 

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో రైతులు తమ భూములను త్యాగం చేశారని గుర్తుచేశారు. ఇందులో కొందరికి ఇప్పటికీ సెటిల్మెంట్ కాలేదని.. అలాంటి పరిశ్రమపై రాష్ట్ర పాలకులు సైతం ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. అయితే వారికి తొలి నుంచి చిత్తశుద్ధి లోపించిందని విమర్శించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలవడంతోపాటు భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్లాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. అయితే వైసీపీ పాలకులు స్పందించలేదని చెప్పారు. 

జనసేన పార్టీ ప్రతి సందర్భంలో కేంద్ర నాయకత్వం, కేంద్ర మంత్రులతో చర్చించినప్పుడు విశాఖ ఉక్కును పరిరక్షించాలని బలంగా చెప్పిందని తెలిపారు. ‘‘కొద్ది రోజుల కిందట పొరుగు రాష్ట్రం ఈ అంశంలో స్పందించింది. దీని వెనక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారు తప్ప పరిశ్రమ కాపాడుతామనే మాట చెప్పలేకపోయారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు వెళ్లలేదు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపింది. జనసేన పార్టీ తొలి నుంచి ఈ పరిశ్రమను పరిరక్షించాలనే కోరుతోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ను బలోపేతం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా విశాఖ ఉక్కు బలపడుతుందని భావిస్తున్నాను’’ అని పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu Speech: చంద్రబాబు సినిమా డైలాగ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu
మండుటెండల్లో చంద్రబాబు.. వేమిరెడ్డి సూపర్ స్పీచ్ | Vemireddy Prabhakar Reddy Speech | Asianet Telugu