
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళగిరిలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం (అక్టోబర్ 30) జరిగే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. ఇందుకోసం పవన్ కల్యాణ్ ఈరోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ జనసేన కార్యకర్తలు, అభిమానులు పవన్‌కు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ రోడ్డు మార్గంలో మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
ఇక, జనసేన పీఏసీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ అధ్యక్షతన రేపటి సమావేశం జరగనుంది. ఇటీవల విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, ప్రభుత్వం అనుసరించిన వైఖరిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ భవిష్యత్తు ప్రణాళికలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే విజయవాడలో పవన్ కల్యాణ్‌ను కలిసిన తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై అంతా కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశాలను కూడా జనసేన పీఏసీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
అలాగే రాష్ట్రంలో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో కలిసి ముందుకు సాగే అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే పొత్తులకు సంబంధించి పవన్ కల్యాణ్ పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జనసేన పీఏసీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక, పవన్ కల్యాణ్ రెండు రోజుల పాటు జనసేన పార్టీ కార్యక్రమాలు, సమావేశాల్లో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.