కాయిన్స్ విసిరితే వజ్రం పగులుతుందా: పవన్ కల్యాణ్ ప్రశ్న

First Published Jun 21, 2018, 11:09 AM IST
Highlights

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు.

హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలపై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. గులాబీ రంగు వజ్రం, ఇతర ఆభరణాల అదృశ్యం విషయంలో రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని అన్నారు. 

ఆ మేరకు పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఓ భక్తుడు కాయిన్స్ విసరడం వల్ల గులాబీరంగు వజ్రం ముక్కలు కావడంపై, అది మాయం కావడంపై ఫోరెన్సిక్ నిపుణులతో సీన్ రిక్రియేట్ చేయలేమా అని ఆయన ప్రశ్నించారు. 

అప్పుడే వాస్తవం తెలిసిపోతుందని అన్నారు. వజ్రాన్ని పరీక్షించడానికి కూడా వీలవుతుందని అన్నారు. శ్రీవారి ఆభరణాలు మాయమయ్యాయని రమణదీక్షితులు తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

కొన్నేళ్ల క్రితం హైదరాబాదు విమానాశ్రయంలో కలిసిన ఓ వ్యక్తి టీటీడీ ఆభరణాల మాయంపై ఆసక్తికరమైన వాస్తవాలను తనకు చెప్పాడని, అప్పటి ప్రతిపక్ష టీడీపీ నేతలకు కూడా ఆ విషయం తెలుసునని చెప్పాడని పవన్ కల్యాణ్ అన్నారు. 

మనదేశం నుంచి ఓ ప్రైవేట్ విమానంలో టీటీడీ ఆభరణాలు మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లాయని అతను చెప్పినట్లు ఆయన తెలిపారు. అందువల్ల టీటీడీ పూజారి ఆక్షేపణలు తనకు ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. బాలాజీ మౌనంగానే ఉంటాడు, దోచుకోవచ్చునని దోపిడీదారులు భావించి ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. 

ప్రభుత్వం వినిపించే సిద్ధాంతం ప్రకారం దేశంలోని ఏ దోపిడీదారుడైనా పిడికెడు కాయిన్స్ ను ఊరేగింపు జరుగుతుండగా విసిరి విగ్రహాల నుంచి ఆభరణాలను తీసుకోవచ్చునని అన్నారు. అయితే, ఖజానాలో దాచిన ఆభరణాల సంగతేమిటని ఆయన ప్రశ్నించారు.  

click me!