చంద్రబాబుకు చెక్: బీసీలపై కన్నేసిన పవన్ కళ్యాణ్

Published : Dec 13, 2018, 02:53 PM IST
చంద్రబాబుకు చెక్: బీసీలపై కన్నేసిన పవన్ కళ్యాణ్

సారాంశం

 రాయలసీమలో టీడీపీ గట్టిపట్టున్న  అనంతపురం జిల్లాలోని బీసీ సామాజిక వర్గాలపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కన్నేశారు.

అనంతపురం: రాయలసీమలో టీడీపీ గట్టిపట్టున్న  అనంతపురం జిల్లాలోని బీసీ సామాజిక వర్గాలపై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కన్నేశారు. అనంతపురం జిల్లాలో టీడీపీకి బీసీ సామాజికవర్గాలు వెన్నంటి  ఉన్నాయి.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 ఎన్నికల్లో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది.ఆ ఎన్నికల్లో కూడ అనంతపురం జిల్లాలో  టీడీపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొంది. టీడీపీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడానికి ఆ జిల్లాలో టీడీపీకి ఉన్న పట్టుతో పాటు ఆ సమయంలో  బతికున్న మాజీ మంత్రి పరిటాల రవి కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతారు.

ఆ తర్వాత పరిణామాల్లో పరిటాల రవి హత్యకు గురికావడంతో  ఆయన సతీమణి టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. పరిటాల రవి తనయుడు శ్రీరామ్ కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు.

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  2019 ఎన్నికల్లో తాను అనంతపురం జిల్లా నుండి పోటీ చేస్తానని ఇదివరకే ప్రకటించారు. కానీ, ఏ జిల్లా నుండి  తాను పోటీ చేస్తాననే విషయమై  ఫిబ్రవరిలో స్పష్టత ఇస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే  అనంతపురం జిల్లాలో టీడీపీ వెంట ఉన్న బీసీ సామాజికవర్గాలపై  జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ కన్నేశారు.అనంతపురం జిల్లాలోని  ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం ఓటర్లు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. దీంతో  బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓట్లను తమ వైపుకు తిప్పుకొనేందుకు పవన్ కళ్యాణ్ కసరత్తు నిర్వహిస్తున్నారు.

జిల్లాలోని పుట్టపర్తి, ధర్మవరం, హిందూపురం, రాయదుర్గం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లుతో పాటు అనంతపురం నియోజకవర్గాల్లో బలిజ సామాజిక వర్గం ఓటర్లు గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. జిల్లాలో పవన్ కళ్యాణ్  నిర్వహించిన కరువు రైతు కవాతులో  కూడ  పెద్ద సంఖ్యలో  బలిజ సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా హాజరయ్యారు.

అనంతపురంలో బలిజ సామాజిక వర్గంతో పాటు  బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడ పెద్ద సంఖ్యలో ఉంటారు. రాయదుర్గంతో పాటు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కూడ బోయ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా  ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల గెలుపు ఓటములపై బోయ సామాజికవర్గం ప్రభావం చూపుతోంది.

బలిజ సామాజిక వర్గం టీడీపీకి దూరమైతే  రాజకీయంగా  తమకు ప్రయోజనమని వైసీపీ కూడ అభిప్రాయపడుతోంది. టీడీపీ వెంట ఉన్న వర్గాలను  తమ వైపుకు తిప్పుకొంటే రాజకీయంగా ఆ మేరకు తమకు ప్రయోజనం ఉంటుందని వైసీపీ అంచనా వేస్తోంది. 

 పవన్‌కళ్యాణ్ పర్యటన సందర్భంగా  వచ్చిన వారిలో యూత్‌ ఎక్కువగా ఉన్నారు పవన్ పర్యటనల సందర్భంగా వచ్చిన యూత్‌ను ఓట్లుగా మలుచుకొనే ప్రయత్నం చేస్తోంది జనసేన. 


 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu