ఆ విషయంలో అంచనా తప్పైంది, నన్ను మన్నించండి: సబ్బం హరి

By Nagaraju TFirst Published Dec 13, 2018, 2:13 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మాజీఎంపీ సబ్బం హరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అనుకున్న దానికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏడాది ముందే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్తున్నప్పుడు టీఆర్‌ఎస్‌ సుమారుగా 90 సీట్లు గెలుచుకునే అవకాశముందని భావించానన్నారు. 
 

విశాఖపట్నం: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై మాజీఎంపీ సబ్బం హరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అనుకున్న దానికి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏడాది ముందే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్తున్నప్పుడు టీఆర్‌ఎస్‌ సుమారుగా 90 సీట్లు గెలుచుకునే అవకాశముందని భావించానన్నారు. 

అయితే ఎన్నికల సమీపంలో కాంగ్రెస్‌ ఇతర పార్టీలతో కలసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసినప్పుడు వారికే అధికారం దక్కుతుందని చెప్పానని గుర్తుచేశారు. తన అంచనా తప్పయిందని, తన మాటలు విశ్వసించే అభిమానులను మన్నించాలని సబ్బం హరి కోరారు. 
 
మరోవైపు తెలంగాణలో కేసీఆర్‌ను బీజేపీయే గెలిపించిందని, ఆ విషయం చాలామందికి తెలుసని వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం బీజేపీ చాలా త్యాగాలు చేసిందన్నారు. ప్రధాని మోదీపై దేశ ప్రజలు చాలా ఆశలు పెట్టుకున్నారని, అయితే వాటిని ఆయన అందుకోలేకపోయారని విమర్శించారు. 

 ప్రస్తుత రోజుల్లో మోదీ రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని చెప్పారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేనన్నారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్‌ ఫ్రంట్‌ వస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.
 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వస్తే వైసీపీ అధినేత వైఎస్ జగన్, జనసేన అధినేత పవన్ ల మధ్య గ్యాప్ బాగా ఉందన్నారు. వారిద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పనిచేస్తారని తానైతే అనుకోవడం లేదని సబ్బం హరి అన్నారు. 

బీజేపీ వారిద్దరినీ కలిపి రంగంలోకి దించితే టీడీపీకి ప్రమాదం పొంచి ఉన్నట్లేనని తేల్చిచెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జగన్‌ కంటే 3-4 శాతం ఓట్లు తెలుగుదేశానికే ఎక్కువగా ఉన్నాయన్నారు. చంద్రబాబు పాజిటివ్‌గా ఉంటారని, అభివృద్ధి కోసమే తపిస్తుంటారని, రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఆయన వైపే వున్నారని సబ్బం హరి విశ్లేషించారు. 

ప్రస్తుత పరిస్థితుల చూస్తే మళ్లీ చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే సాయం చేస్తామని హామీ ఇచ్చే పార్టీతో ఆయన కలిసి పనిచేస్తే బాగుంటుందన్నది తన అభిప్రాయంగా చెప్పారు. తెలంగాణ ఫలితాల ప్రభావం ఏపీపై ఉండదన్నారు. 
 

click me!