ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేయని వారు కూడా మంత్రులా: లోకేష్ పై మాజీ సీఎస్ సెటైర్లు

Published : Dec 13, 2018, 02:41 PM ISTUpdated : Dec 13, 2018, 02:42 PM IST
ఒక్కరోజు ఎమ్మెల్యేగా చేయని వారు కూడా మంత్రులా: లోకేష్ పై మాజీ సీఎస్ సెటైర్లు

సారాంశం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై మాజీ సీఎస్ అజయ్ కల్లాం నిప్పులు చెరిగారు. నెల్లూరులో జరిగిన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సదస్సులో పాల్గొన్న ఆయన చంద్రబాబు చర్యలను తీవ్రంగా విమర్శించారు. ఏపీలో రాచరికపు ప్రజాస్వామ్యం నడుస్తోందని ఆరోపించారు.   

నెల్లూరు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై మాజీ సీఎస్ అజయ్ కల్లాం నిప్పులు చెరిగారు. నెల్లూరులో జరిగిన సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సదస్సులో పాల్గొన్న ఆయన చంద్రబాబు చర్యలను తీవ్రంగా విమర్శించారు. ఏపీలో రాచరికపు ప్రజాస్వామ్యం నడుస్తోందని ఆరోపించారు. 

ప్రజాస్వామ్యంలో రాచరికపు పోకడలు వచ్చాయని ప్రజాస్వామ్యంలో కుటుంబ పాలన పెత్తనం చేస్తోందని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒక రోజు ఎమ్మెల్యేగా కూడా చేయని వారు  మంత్రులు అవుతున్నారని పరోక్షంగా మంత్రి నారా లోకేష్‌ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో రాచరికపు వ్యవస్థలకు ప్రజలే చెక్‌ పెట్టాలని కోరారు. 

తమిళనాడు పుణ్యమా అని సినిమా హీరోలు రాజకీయాల్లోకి రావడం ఇక్కడా వచ్చిందని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఆదర్శవంతమైన నేతలు ఈరోజుల్లో కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలకు స్వతంత్రత కావాలని కోరారు. 

రాష్ట్రంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అసెంబ్లీ అనుమతి లేకుండా రూ.27 వేల కోట్లు ఖర్చు చేశారని మండిపడ్డారు. కాగ్‌ తప్పుబట్టినా ఈ విషయాన్ని ఎవరూ ప్రశ్నించడంలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు చేస్తున్న వేల కోట్ల రూపాయల అప్పులు ఎవరి కోసం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 

ప్రజల అభిప్రాయాలకు ప్రస్తుత కాలంలో విలువ లేకుండా పోయిందని అజయ్ కల్లాం ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా పంచాయతీరాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీలే పెత్తనం  చేస్తున్నాయని మండిపడ్డారు. 

ఒక్కో జిల్లాలో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. సింగపూర్‌ విమానం కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు. చనిపోయిన రైతులను ఆదుకోరు కానీ విమాన ప్రయాణానికి రాయితీలు ఆగమేఘాల మీద చెల్లిస్తారని విమర్శించారు.

తెలంగాణాలో డబుల్‌ బెడ్‌రూం నిర్మాణంలో భాగంగా చదరపు అడుగుకు రూ.800 ఖర్చు అవుతుంటే...ఏపీలో మాత్రం చదరపు అడుగుకు రూ.2700 అయినట్లు ఖర్చు చూపిస్తున్నారని, ఈ విషయంలోనే చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవిధంగా దోచుకుంటున్నారో అర్ధమవుతోందని వ్యాఖ్యానించారు. ప్రజల డబ్బును దుర్వినియోగం చేయడానికా ప్రభుత్వం ఉంది అంటూ నిలదీశారు అజయ్ కల్లాం. 
 

PREV
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu