రైతు భరోసాకు అమ్మ సాయం.. తన పెన్షన్‌ను విరాళంగా ఇచ్చిన పవన్ తల్లి

By Siva KodatiFirst Published Jun 25, 2022, 10:06 PM IST
Highlights

జనసేన పార్టీ కౌలు రైతు భరోసా కార్యక్రమానికి పలు రంగాలకు చెందిన ప్రముఖుల నుంచి విరాళాలు అందుతున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం పవన్ కల్యాణ్ తల్లి అంజనా దేవి తనకు వచ్చే పెన్షన్‌లో రూ.1.50 లక్షలను విరాళంగా అందజేశారు.  

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ (pawan kalyan) నేతృత్వంలో జ‌న‌సేన పార్టీ (janasena) చేప‌ట్టిన కౌలు రైతు భ‌రోసాకు (janasena koulu rythu bharosa) అభిమానులతో పాటు ప‌వ‌న్ కుటుంబ స‌భ్యుల నుంచి ఇప్ప‌టికే విరాళాలు అందిన సంగ‌తి తెలిసిందే. తాజాగా పవన్ కల్యాణ్ త‌ల్లి అంజ‌నా దేవి (anjana devi) త‌న వంతుగా సాయం అంద‌జేశారు. రూ.1.50 ల‌క్ష‌ల‌ను కౌలు రైతు భ‌రోసాకు ఇచ్చిన అంజ‌నా దేవి, మ‌రో రూ.1 ల‌క్ష‌ను పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఈ మేర‌కు హైద‌రాబాద్‌లో జనసేన అధినేత ప‌వ‌న్‌కు ఆమె చెక్కులు అంద‌జేశారు. త‌న భ‌ర్త కొణిదెల వెంక‌ట్రావు జ‌యంతి సంద‌ర్భంగా ఆమె ఈ విరాళాన్ని అందిస్తున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. 

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ... త‌న తండ్రి ఏపీ ప్ర‌భుత్వంలో ఉద్యోగ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి రిటైర్ అయ్యార‌ని చెప్పారు. ఎక్సైజ్ శాఖ‌లో ఆయ‌న ప‌నిచేశార‌ని, ఆయ‌న‌కు వ‌చ్చిన జీతంతోనే తామంతా పెరిగామ‌ని, 2007లో త‌న తండ్రి మ‌ర‌ణించినట్లు తెలిపారు. ఈ క్ర‌మంలో త‌న త‌ల్లికి ప్ర‌భుత్వం పెన్ష‌న్ అందిస్తోంద‌ని, ఆ సొమ్మును ఆత్మహ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల‌ను ఆదుకునేందుకు త‌న త‌ల్లి ఇవ్వ‌డం త‌న‌కు సంతోషంగా ఉంద‌ని పవన్ కల్యాణ్ తెలిపారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అది తమ కుటుంబానికి భావోద్వేగంతో కూడుకున్నదని.. అందుకే సీపీఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని జనసేనాని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఉద్యోగులకు అండగా ఉంటామని ఆయన వెల్లడించారు. 

click me!