టీడీపీపై ఎక్స్‌ట్రా ప్రేమ లేదు.. ప్రయోగాలు చేయను, జనసేన ఈసారి బలిపశువు కాదు : పొత్తులపై తేల్చేసిన పవన్

Siva Kodati |  
Published : Mar 14, 2023, 11:41 PM ISTUpdated : Mar 15, 2023, 12:12 AM IST
టీడీపీపై ఎక్స్‌ట్రా ప్రేమ లేదు.. ప్రయోగాలు చేయను, జనసేన ఈసారి బలిపశువు కాదు : పొత్తులపై తేల్చేసిన పవన్

సారాంశం

తనకు క్షేత్రస్థాయిలో సంపూర్ణ మద్ధతు వుందని తేలితే జనసేన ఒంటరిగా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్. వైసీపీ ఏం కోరుకుంటుందో అదే జరుగుద్దని పవన్ స్పష్టం చేశారు. 

కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు క్షేత్రస్థాయిలో సంపూర్ణ మద్ధతు వుందని తేలితే జనసేన ఒంటరిగా వెళ్లడానికి సిద్ధమేనని ప్రకటించారు. తనకు గజమాలలు, పూల మాలలు వద్దని ఓట్లు వేయాలని ఆయన కోరారు. గత ఎన్నికల్లో బలమైన నేత దేశానికి కావాలనే ఉద్దేశంతో మోడీకి మద్ధతు పలికినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. మోడీకి మద్ధతు ప్రకటించగానే.. తనను చాలా మంది వెటకారం చేశారని ఆయన దుయ్యబట్టారు.

తనకు అప్పట్లో బీజేపీ అంటే తెలియదని.. మోడీ ఒక్కరే తెలుసునని పవన్ వ్యాఖ్యానించారు. పాతిక సీట్లు ఇస్తే మెడల వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న వారు.. మెడలు వంచి దండాలు పెడుతున్నారంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. హోదా కోసం ఉద్యమం చేద్దామనుకుంటే ఓడించి తూట్లు పొడిచేశారని, చివరికి తనను ఒంటరిని చేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. హోదా కోసం తాను ఎంతో ఇష్టపడిన మోడీని కూడా ఎదిరించినట్లు ఆయన చెప్పారు. 

బీజేపీ నేతలు తాను అనుకున్న విధంగా ప్రోగ్రామ్స్ జరగనిస్తే.. బీజేపీ - జనసేనలు అధికారంలో వుండేవని పవన్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎక్స్‌ట్రా ప్రేమ లేదన్న పవన్.. చంద్రబాబు సమర్ధుడని ప్రశంసించారు. టీడీపీతో 20 సీట్ల గురించి తాను మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు. జనసేన ఈసారి బలిపశువు కాదని.. ప్రయోగాల జోలికి వెళ్లనని పవన్ తేల్చిచెప్పారు. అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగానే ప్రణాళిక వుంటుందని, తమ వద్ద డబ్బులు కూడా లేవన్నారు.

తెలంగాణలో పోటీ చేస్తానంటే ఆంధ్రావాడిని అంటున్నారని.. బీజేపీకి ఆంధ్రావాళ్ల ఓట్లు కావాలి కానీ, ఆంధ్రా వాళ్లు పోటీ చేయకూడదా అని పవన్ ప్రశ్నించారు. వచ్చే ఏపీ ఎన్నికల్లో జనసేన సత్తాను చాటుతామన్న ఆయన.. ఈసారి తమది బలమైన సంతకమని పేర్కొన్నారు. వైసీపీ ఏం కోరుకుంటున్నదో అదే జరుగుతుందని స్పష్టం చేశారు. ఓటును వృథా కానివ్వనన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో తనతో సహా అందరూ గెలిచే తీరాలని పిలుపునిచ్చారు. 

బీజేపీతో పొత్తు అంటే ముస్లింలు తనను వదిలేస్తున్నానరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆజాన్ వినిపిస్తే తన మీటింగ్ ఆపేస్తానని పవన్ గుర్తుచేశారు. జగన్ ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారో తనకు తెలుసునని.. కేంద్రంలో ఏ పార్టీ వుంటే ఆ పార్టీకి జగన్ మద్ధతు ఇస్తారని జనసేనాని స్పష్టం చేశారు. ముస్లిం సమాజంపై ఎవరూ వేలు పెట్టినా తాట తీస్తామని పవన్ హామీ ఇచ్చారు. తాను బీజేపీతో వున్నన్ని రోజులూ ముస్లింలపై దాడి జరిగితే పొత్తు నుంచి బయటకు వస్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బెదిరించడానికి , సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి చిన్నపిల్లలు కాదు కానీ.. సీసీఎస్ హామీ నెరవేర్చడానికి కాదా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే మీకు కోపం రావడం లేదా అని ప్రజలను నిలదీశారు. రామతీర్థం, పీఠాపురంలలో ఆలయాలు ధ్వంసం అయితే ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్య నిషేధం చేస్తానన్న వ్యక్తి ప్రజల సంపాదనకు ప్రజాప్రతినిధులు ధర్మకర్తలు మాత్రమేనని పవన్ స్పష్టం చేశారు. అక్రమ సంపాదనను ప్రజలను కొనేందుకే వాడుతున్నారని ఆరోపించారు. దేశం మొత్తానికి గంజాయి ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్తోందని.. అరకు బోర్డర్ నుంచే గంజాయి సప్లయ్ అవుతోందని దీనిని వైసీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని పవన్ వ్యాఖ్యానించారు. విలువలు మాట్లాడే నాలాంటి వాడు ఓడిపోతూనే వున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు