దేనికి గర్జనలు?.. జగన్ సర్కార్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. వరుస ట్వీట్స్‌తో ప్రశ్నల వర్షం..

Published : Oct 10, 2022, 11:18 AM IST
దేనికి గర్జనలు?.. జగన్ సర్కార్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. వరుస ట్వీట్స్‌తో ప్రశ్నల వర్షం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు.  దేనికి గర్జనలు? అని వరుస ట్వీట్స్‌తో వైసీపీ సర్కార్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా అని ప్రశ్నించారు.  

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధించారు. వికేంద్రీకరణ వర్సెస్ అభివృద్ది అంటూ పలు అంశాలను ప్రస్తావించారు. వికేంద్రీకరణకు మద్దతు పేరుతో ఏర్పాటు చేస్తున్న రౌండ్ టేబుల్ సమావేశాలు.. ఈ నెల 15న  విశాఖ గర్జన పేరిట తలపెట్టిన భారీ ర్యాలీని ఉద్దేశించి పవన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి తనదైన శైలిలో కౌంటర్‌లు ఇచ్చారు. దేనికి గర్జనలు? అని వరుస ట్వీట్స్‌తో వైసీపీ సర్కార్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. మూడు రాజధానులతో రాష్ట్రాన్ని ఇంకా అధోగతి పాలు చేయాటానికా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పినదానికి భిన్నంగా చేస్తున్నందుకా అని ప్రశ్నించారు. 

‘‘ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఆపలేకపోయినందుకా?.. మత్స్యకారులకు సొంత తీరంలో వేటకు అవకాశం లేక గోవా, గుజరాత్, చెన్నై వెళ్లిపోతున్నందుకా?.. విశాఖపట్నంలో ఋషికొండను అడ్డగోలుగా ధ్వంసం చేసి మీ కోసం భవనం నిర్మించుకొంటున్నందుకా?.. దసపల్లా భూములను మీ సన్నిహితులకు ధారాదత్తం చేసేలా ఆదేశాలు ఇచ్చినందుకా?.. రోడ్లు వేయనందుకా?.. చెత్త మీద కూడా పన్ను వసూలు చేస్తున్నందుకా? సీపీఎస్ మీద మాట మార్చినందుకా?.. ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వనందుకా? పోలీసులకు టిఏ, డిఏలు ఇవ్వనందుకా?.. అందమైన అరకు పేరును కాస్తా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మార్చేసినందుకా?.. గంజాయి కేసుల్లో రాష్ట్రాన్ని ఒకటో స్థానంలో నిలిపినందుకా?..  ఫీజు రీ ఎంబర్స్మెంట్ చేయనందుకా?.. విదేశీ విద్యా స్కీముకి పేరు మార్చి.. నిధులు ఇవ్వనందుకా? ’’ అని పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. 

అలాగే.. రాజధాని వికేంద్రీకరణ ఆలోచనలపై వైసీపీ సర్కార్‌కు పవన్ పలు ప్రశ్నలు సంధించారు. హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల సమూహం మూడు నగరాల్లో ఉండటం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధికి హామీ ఇస్తుందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని వైసీపీ ప్రభుత్వం హృదయపూర్వకంగా కోరుకుంటే.. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఆర్థిక అధికారాలు, నిర్ణయాధికారాలను ఎందుకు ఇవ్వకూడదని సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు స్థానిక సంస్థల నిధులను (14వ, 15వ ఆర్థిక సంఘం) ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేకపోయిందో సమాధానం చెప్పాలని అన్నారు. ప్రభుత్వ పెద్దలు నిజంగా 73, 74వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. అన్ని అధికారాలను స్థానిక సంస్థలకు ఎందుకు బదిలీ చేయరని అడిగారు. ఇది నిజమైన వికేంద్రీకరణ కాదా అని ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్