
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రఖ్యాత శైవక్షేత్రం మహానంది ఆలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టడంతో ఆదివారం కలకలం రేగింది. డ్రోన్ ద్వారా ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరిస్తుండగా.. ఆలయ సిబ్బంది గమనించారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది డ్రోన్‌ను ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారన్న సంగతిని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. ఆగంతకుడు కారులో పారిపోయాడు. ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఇతర అధికారులు కారులో అతనిని వెంబడించారు. అయినప్పటికీ ఆగంతకుడు మాత్రం దొరక్కుండా పారిపోయాడు. ఈ ఘటనపై ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో ఆగంతుకుడిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా.. మహానందికి దగ్గరలోని మరో పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలోనూ గతేడాది డిసెంబర్‌లో డ్రోన్లు సంచారం కలకలం రేపింది. డ్రోన్ విషయంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఆలయ పుష్కరిణి వద్ద భక్తులు స్నానం చేస్తూ పైన డ్రోన్ ఎగురుతున్న దృశ్యాలను చూసి ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో రంగం లోకి దిగిన భద్రత సిబ్బంది డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రోన్ ఎగరవేసిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నిందితులను ఇద్దరు గుజరాత్ కు చెందిన వారిగా గుర్తించారు.
Also REad:శ్రీశైలంలో మళ్లీ Drone కలకలం
ఈ ఘటన నేపథ్యంలో ఆలయ భద్రతపై భక్తులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. భక్తులు సమాచారమిచ్చేంత వరకు ఆలయ భద్రత సిబ్బంది ఏం చేస్తున్నారు అన్నది పెద్ద ప్రశ్న. ఈ పరిణామం శ్రీశైలంలో భద్రతా వైఫల్యాన్ని కళ్ళకు కట్టింది. భక్తులకు ఉన్నపాటి శ్రద్ధ కూడా ఆలయ భద్రతా సిబ్బందికి లేదన్న టాక్ వినిపిస్తుంది. అయితే అదే ఏడాదిలో పలుమార్లు శ్రీశైల ఆలయం సమీపంలో డ్రోన్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. 2021 మే నెలలో దాదాపు నాలుగు రోజుల పాటు.. రాత్రి సమయాల్లో శ్రీశైలం శైవక్షేత్రం పై డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం అప్పట్లో కలకలం రేపింది. మరో వైపు ప్రతిపక్షాలు రంగంలో దిగాయి. శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రమాదం పొంచి ఉందని , బీజేపీ నేతలు ఈ పుణ్యక్షేత్రాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు.