ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో రేపు లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు. దానికి ఒక రోజు ముందే విశాఖ జిల్లాకు చెందిన కీలక నేత పసుపులేటి బాలరాజు జనసేనకు రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది.
విశాఖపట్నం: ఇసుక కొరతపై విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ తలపెట్టిన వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మరో షాక్ తగలనుంది. విశాఖపట్నం జిల్లాకు చెందిన కీలక నేత, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు జనసేనను వీడబోతున్నారు. శనివారంనాడే బాలరాజు జనసేనకు రాజీనామా చేస్తారని తెలుస్తోంది.
సాధారణ ఎన్నికల తర్వాత బాలరాజు జనసేనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. రాజీనామా తర్వాత బాలరాజు ఏ పార్టీలో చేరుతారనే విషయంపై స్పష్టత లేదు. అయితే, వైఎస్సార్ కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం సాగుతోంది.
అయితే, టీడీపీలో గానీ బిజెపిలో గానీ చేరే అవకాశాలున్నాయని కూడా అంటున్నాైరు. మరో ప్రత్యామ్నాయంపై కూడా బాలరాజు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండి గిరిజనుల సమస్యలపై పోరాటం చేయాలని ఆయన అనుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది.
ఎన్నికల్లో జనసేప ఘోరంగా దెబ్బ తిన్నది. పార్టీ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో కూడా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జనసేన నుంచి ఒక్కొక్క నేతనే బయటకు వస్తున్నాడు. తాజాగా, బాలరాజు కూడా పార్టీని వీడుతారని ప్రచారం సాగుతోంది. ఆదివారంనాడు విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ లాంగ్ మార్చ్ చేపట్టనున్నారు. దానికి ఒక్క రోజు ముందే బాలరాజు పార్టీ నుంచి తప్పుకుంటారనే ప్రచారం సాగుతోంది.