వీధుల్లో గాలికి లేచే ఆకు రౌడీ చింతమనేని:పవన్ ఫైర్

By Nagaraju TFirst Published Oct 8, 2018, 7:05 PM IST
Highlights

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. నువ్వు ఒకటంటే నేను వందంటా అన్న చందంగా ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు.  
 

ఏలూరు: దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. నువ్వు ఒకటంటే నేను వందంటా అన్న చందంగా ఒకరిపై ఒకరు నిప్పులు చెరుగుతున్నారు.  

తాజాగా పవన్ కళ్యాణ్ మరోసారి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీధుల్లో గాలికి లేచే ఆకురౌడీ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అలాంటి వ్యక్తులను వెనకేసుకు వస్తారనుకుంటే చంద్రబాబుకు మద్దతు ఇచ్చే వాడిని కాదని పవన్ స్పష్టం చేశారు. 

రాజకీయవ్యవస్థ ముఖ్యమంత్రుల పిల్లలకు ఒక అలంకారమని, ఆ అలంకారాన్ని కొనసాగించాలని భావిస్తున్నారని పవన్‌ ఆరోపించారు. సీఎం పదవి వారసత్వమని జగన్‌ భావిస్తున్నారా? అంటూ పవన్‌ ప్రశ్నించారు. సీఎం పదవి చంద్రబాబు నాయుడుకు, జగన్ కు వారసత్వమేమోకానీ తనకు మాత్రం ఓ బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు.

గతంలో పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ చింతమనేని ప్రభాకర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను గాలి రౌడీలు, ఆకు రౌడీలకు భయపడే వ్యక్తిని కాదని, ఒక్క సైగ చేస్తే కాళ్ళు విరగ్గొట్టి కూర్చోబెడతారంటూ హెచ్చరించారు. 16 ఏళ్ల వయసులోనే ఆకు రౌడీలు, గాలి రౌడీలను తన్ని తగలేశా.. ఖబడ్దార్ చింతమనేని అంటూ హెచ్చరించారు. 

27 కేసులున్న వ్యక్తిని విప్‌గా ఎలా నియమించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకొస్తున్న టీడీపీకి తానెందుకు అండగా ఉండాలని ప్రశ్నించారు. ప్రభాకర్ లాంటి వ్యక్తి సింగపూర్‌లో ఉంటే కర్రతో కొడతారని, సౌదీ అరేబియాలో అయితే తల తీసేస్తారని పవన్ తెలిపారు. ఆడపిల్లలను, మహిళలను బూతులు తిడితే చూస్తూ ఊరుకోమన్నారు. చింతమనేని అంటే చంద్రబాబు, లోకేష్‌కు భయమని ఎద్దేవాచేశారు.  

మరోవైపు తాను కన్నెర్రజేస్తే పవన్ కళ్యాణ్ దెందులూరులో సమావేశం పెట్టేవారా అని ఎమ్మెల్యే చింతమనేని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నందుకే సంయమనంతో ఉన్నానని స్పష్టం చేశారు. దెందులూరు నుంచి పోటీ చేయమంటే ఎవరినో పోటీకి నింపుతానంటున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే పవన్ కళ్యాణ్ దెందులూరులో పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు.  

నా రౌడీయిజం పేదవాడి సమస్యల పరిష్కారంలో ఉంటుందని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టి.,కులపిచ్చి తీసుకురావాలని పవన్ చూస్తున్నారని చింతమనేని ఆరోపించారు. మరోవైపు పవన్‌, జగన్‌లతో బీజేపీ తోలుబొమ్మలాట ఆడిస్తోందని చింతమనేని విమర్శించారు. పవన్ కళ్యాణ్, జగన్ లు బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు.
 

click me!