అలాంటి వ్యక్తిని జైలులో పెట్టడం దుర్మార్గం.. జగన్ ఏమైనా మహానుభావుడా?: వైసీపీపై పవన్ ఫైర్

Published : Sep 14, 2023, 02:19 PM IST
అలాంటి వ్యక్తిని జైలులో పెట్టడం దుర్మార్గం.. జగన్ ఏమైనా మహానుభావుడా?: వైసీపీపై పవన్ ఫైర్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన  సాగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించారు. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించారని మండిపడ్డారు. 

ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగున్నరేళ్లుగా అరాచక పాలన  సాగుతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విమర్శించారు. అందులో భాగంగాlo తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి రిమాండ్‌కు పంపించారని మండిపడ్డారు. ఇది చాలా బాధకరమని  అన్నారు. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఈరోజు ములాఖత్ అయ్యారు. అనంతరం పవన్ కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు సానుభూతి ప్రకటించడానికే తాను ఇక్కడికి వచ్చినట్టుగా చెప్పారు. గతంలో చంద్రబాబుకు, తనకు పాలసీల విషయంలో భిన్నమైన ఆలోచన  ఉన్నాయని.. అందుకే తాము విడిగా పోటీ చేశామని చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. 

2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తాను నరేంద్ర మోదీకి మద్దతు తెలిపానని పవన్ కల్యాణ్ అన్నారు. దేశానికి బలమైన నాయకత్వం కావాలని  అనుకున్నానని.. అందుకే మోదీకి మద్దతుగా నిలిచానని చెప్పారు. ఆ రోజు  నుంచి తాను మోదీ పిలిస్తేనే వెళ్లానని.. ఎప్పుడూ తన కోసం వెళ్లలేదని తెలిపారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌కు అనుభవం ఉన్న నాయకుడు కావాలనే.. 2014‌లో టీడీపీ, బీజేపీల కూటమికి మద్దతుగా నిలిచానని చెప్పారు. చంద్రబాబు 1990లలో 2020 విజన్ అంటే ఎవరికి అర్థం కాలేదని.. ఇప్పుడు మాదాపూర్‌లో లక్షలాది ఉద్యోగులు ఉన్నారని, లక్షల కోట్లు టర్న్ ఓవర్‌ వస్తుందని,  కొత్త సిటీని క్రియేట్ చేయడంలో ఆయన పాత్ర పోషించారని చెప్పారు. 

చంద్రబాబుతో విభేదాలు ఉండొచ్చని, అభిప్రాయ భేదాలు ఉండొచ్చని, పాలసీపరంగా విభేదాలు ఉన్నప్పటికీ.. ఆయన పాలన సామర్థ్యాలపై తనకు ఎటువంటి అపనమ్మకం లేదని అన్నారు. ఆరోజున ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోవడంపై తాను విబేధించానని చెప్పారు. ఇది పాలసీపరమైన విబేధాలతో గొడవపడి బయటకు వచ్చానే తప్ప.. వ్యక్తిగతంగా చంద్రాబు ఇంటిగ్రిటీని తాను ఎప్పుడూ ప్రశ్నించలేదని చెప్పారు. 

Also Read: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసే పోటీ చేస్తాయి.. పవన్ ప్రకటన

సైబరాబాద్‌ వంటి సిటీని రూపకల్పన చేసిన చంద్రబాబుపై రూ. 300 కోట్ల స్కామ్‌ చేశారని జైలులో పెట్టడం దుర్మార్గమని చెప్పారు. మనీలాండరింగ్ జరిగితే ఈడీ విచారణ చేయాలి కదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై అభియోగాలు మోపిన జగన్ ఏమైనా మహానుభావుడా? అని ప్రశ్నించారు. ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్ అని విమర్శించారు. చంద్రబాబుతో పాలసీపరమైన విభేదాలు ఉండొచ్చని.. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు రాష్ట్రానికి మంచిది కాదని  అన్నారు. 

జగన్‌ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలని ఎద్దేవా చేశారు. జగన్ రాజ్యంగపరమైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు డేటా చౌర్యంపై మాట్లాడిన జగన్.. ఆ తర్వాత వాలంటీర్ల ద్వారా డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన జగన్.. ఇటువంటి అవినీతి ఆరోపణలు చేయడం హ్యాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. 

Also Read: ములాఖత్‌లో చంద్రబాబుతో మాట్లాడింది ఇదే.. : పవన్ కల్యాణ్, వైసీపీపై సెటైర్లు

జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా.. అడ్డగోలుగా దోపిడికి పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ బురదలో కురుకుపోయి.. ఆ బురదను ఇతరుల మీద వేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu