రెండు రూపాయలకే ఆకలి తీర్చాడు: ఎస్పీవై రెడ్డిపై పవన్

By telugu teamFirst Published May 1, 2019, 12:10 AM IST
Highlights

ఎస్పీవై రెడ్డి మృతిపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.  ఎస్పీవై రెడ్డి రాజకీయాల్లో హుందాతనం పాటించిన నాయకుడని ఆయన అన్నారు. విద్యావంతుడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాలు సాధించారని కొనియాడారు.

హైదరాబాద్: నంద్యాల పార్వమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంతాపం ప్రకటించారు.  నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్.పి.వై.రెడ్డి మరణం చాలా బాధాకరమని ఆయన అన్నారు. ఎస్పీవై మృతికి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎస్పీవై రెడ్డి కుటుంబానికి జనసేన పార్టీ, కార్యకర్తల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 
ఎస్పీవై రెడ్డి మృతిపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.  ఎస్పీవై రెడ్డి రాజకీయాల్లో హుందాతనం పాటించిన నాయకుడని ఆయన అన్నారు. విద్యావంతుడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాలు సాధించారని కొనియాడారు. సామాజిక సేవలో ఆయన నిమగ్నమైన తీరు, కరవు ప్రాంతాల్లో ప్రజలకు అందించిన చేయూత ఎన్నదగినవని పవన్ కల్యాణ్ అన్నారు.

రాజకీయాల్లోకి రాకముందే పేదల ఆకలి తీరేలా రెండు రూపాయలకే ఆహారం అందించే కేంద్రాలు నెలకొల్పినవాడు ఎస్పీవై రెడ్డి అని అని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. మూడు దఫాలు లోక్‌సభ సభ్యుడిగా సేవలందించారని అన్నారు. జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు ఎస్.పి.వై.రెడ్డి అనుభవం, సేవాతత్పరత సమాజానికి ఎంతో దోహదపడుతాయని మనస్ఫూర్తిగా ఆహ్వానించానని చెప్పారు.

నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి నిలిపామని ఆయన గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే ఎస్పీవై రెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని, ఎస్.పి.వై.రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. 

సంబంధిత వార్త

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

click me!