నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

By telugu teamFirst Published Apr 30, 2019, 11:51 PM IST
Highlights

కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి (69) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 

హైదరాబాద్: కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంటు సభ్యుడు ఎస్పీవై రెడ్డి (69) కన్నుమూశారు. కొంత కాలంగా ఆయన కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ లో గల కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. 

ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి లోకసభ అభ్యర్థిగా పోటీ చేశారు. 2014లో వైసీపీ తరపున ఆయన ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత వెంటనే టీడీపీలో చేరారు. టీడీపీ నుంచి నంద్యాల సీటు ఆశించి భంగపడ్డ ఆయన జనసేనలో చేరారు.

ఎస్పీవై ‌రెడ్డి 1950 జూన్ 4న కడప జిల్లా అంకాలమ్మగూడూరులో జన్మించారు. ఆయనకి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వరంగల్ నిట్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి ప్రవేశించారు. ఎస్పీవై రెడ్డి పూర్తి పేరు సన్నపురెడ్డి పెద్ద ఎరుకల రెడ్డి. 

బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన 1991 ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 1999లో నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ స్థానాలకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నంద్యాల అసెంబ్లీ నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2000లో కాంగ్రెస్‌లో చేరిన ఎస్పీవై రెడ్డి 2004లో నంద్యాల ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2009, 2014లో ఇదే స్థానం నుంచి ఎంపీగా గెలిచారు.

ఎస్పీవై రెడ్డి మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఎస్పీవై రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మూడు సార్లు ఎంపీగా ఎస్పీవై రెడ్డి సేవలు ప్రశంసనీయమని చంద్రబాబు అన్నారు.

click me!