జగన్, చంద్రబాబులకు సవాల్ విసిరిన పవన్ కల్యాణ్

First Published Jul 6, 2018, 6:57 PM IST
Highlights

చంద్రబాబు, జగన్ లకు పవన్ కల్యాణ్ సవాల్ విసిరారు. విశాఖ రైల్వే జోన్ కోసం తనతో కలిసి పోరాటానికి రాగాలరా అని అడిగారు. రైల్ రోకో నిర్వహిద్దామని ఆయన పిలుపునిచ్చారు. 

విశాఖపట్నం: ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు సవాల్ విసిరారు. విశాఖ రైల్వే జోన్ కోసం తాను పోరాటం చేస్తానని అంటూ తనతో చంద్రబాబు, జగన్ కలిసి రాగలరా అని అడిగారు.

విశాఖపట్నం జిల్లా తగరపువలసలో ప్రజా పోరాట యాత్రలో భాగంగా శుక్రవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం ఎంపీలు అవంతి శ్రీనివాస్, మురళీమోహన్ లకు రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంటే హేళన అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన 19 ఎంపీలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వే జోన్ కోసం పోరాటానికి జగన్, చంద్రబాబులతో తాను కలిసి వస్తానని, రైల్ రోకో చేద్దామని ఆయన చెప్పారు. 

రాష్ట్రంలో ఎక్కడ చూసినా భూదోపిడీలేనని ఆయన విమర్శించారు. జూట్ మిల్లు కార్మికుల సమస్యలను పరిష్కరిస్తారని గంటా శ్రీనివాస్ రావును ఎన్నికల్లో గెలిపించామని అన్నారు. రాష్ట్రంలో కాలుష్యం వల్ల 24 జాతుల మత్స్య సంపద నాశనమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!