పవన్ కల్యాణ్, జగన్: చంద్రబాబు ప్రత్యర్థి ఎవరు?

First Published May 30, 2018, 10:28 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆ మధ్య చెప్పారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ ఉంటుందని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆ మధ్య చెప్పారు. అయితే, అవి ఏ పార్టీలనే విషయాన్ని ఆయన వెల్లడించలేదు. చూస్తే, రాష్ట్రంలో ఐదు పార్టీలున్నాయి. తెలుగుదేశం, జనసేన, వైఎస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, బిజెపి. పవన్ కల్యాణ్ బహుశా బిజెపిని, కాంగ్రెసును లెక్కలోంచి తీసేసి ఉంటారు. 

ఇకపోతే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ మహానాడులో ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. తమ శత్రువు బిజెపి మాత్రమేనని, మరెవరూ కారని అన్నారు. నారా లోకేష్ తన లెక్కలోంచి వైఎస్సార్ కాంగ్రెసు, కాంగ్రెసు, జనసేనలను తీసేసి ఉంటారని అనుకోవచ్చు.

చంద్రబాబు మాత్రం బిజెపిని లక్ష్యంగా చేసుకుని రాజకీయ దాడి సాగిస్తున్నారు. మూడు రోజుల మహానాడులో ఆయన ప్రధానంగా బిజెపినే లక్ష్యం చేసుకున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై, జనసేన పవన్ కల్యాణ్ పై కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. బిజెపిపై చేసినంత తీవ్రమైన వ్యాఖ్యలు వారిపై చేయడం లేదు. 

జగన్ అవినీతి ఎత్తి చూపే ప్రయత్నం చంద్రబాబు ప్రధానంగా చేస్తున్నారు. పవన్ కల్యాణ్ వివిధ సమస్యలపై ఎక్కుపెడుతున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వారిద్దరు కూడా బిజెపితో కమ్ముక్కయ్యారని ఆరోపిస్తూ వారి ప్రాధాన్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్క్రిప్టును పవన్ కల్యాణ్ చదువుతున్నారని చంద్రబాబు అంటూ బిజెపిపైనే తన విమర్శలను ఎక్కుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై ప్రధానంగా విమర్శలు ఎక్కుపెట్టడం ద్వారా ప్రజల మద్దతును ఆయన కూడగట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్, జగన్ చంద్రబాబుకు ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా నిలబడుతారనే విషయంలో సందేహం అవసరం లేదు.

click me!