ఎపి మూడు ముక్కలయ్యే ప్రమాదం: పవన్ కల్యాణ్ హెచ్చరిక

First Published May 30, 2018, 8:11 AM IST
Highlights

రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

శ్రీకాకుళం: రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. నిధులు, నియామకాలు, నీళ్లలో ప్రాంతాల మధ్య వివక్ష చూపిస్తే రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ పరిస్థితికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే కారణమని విమర్శించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో  హైదరాబాదులోనే అభివృద్ధిని కేంద్రీకరించడం వల్ల విభజన వాదం తలెత్తిందని, ఇప్పుడు అదే తప్పు అమరావతి విషయంలో జరుగుతోందని అన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో సర్పంచి వ్యవస్థను నీరుగార్చారని విమర్శించారు. 
తెలుగుదేశం పార్టీ జెండా మోస్తేనే ఇల్లైనా.. పింఛనైనా వస్తుందని, ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇల్లు కట్‌.. పింఛన్‌ కట్‌ అవుతుందని అన్నారు. జనసేన అధికారంలోకి రాగానే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వీటిపై విచారణ జరిపిస్తుందని అన్నారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో మంగళవారం నిరసన కవాతు అనంతరం రోడ్డుషోలో ఆయన ప్రసంగించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు రమణదీక్షితులుకు చంద్రబాబు రిటైర్మెంట్‌ ప్రకటించినట్లే రాష్ట్ర ప్రజలు త్వరలో ఆయనకూ రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. దమ్ముంటే 2019 ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేయాలని, ఎన్టీఆర్‌ ఫోటో పెట్టకోకుండా ఎన్నికల ప్రచారం చేపట్టాలని సవాల్‌ విసిరారు.   

ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పరిశోధన పనులు ఆస్ట్రేలియా సంస్థకు అప్పగించామని ముఖ్యమంత్రి అంటున్నారని గుర్తు చేస్తూ అసలు ఆ సంస్థ ఎవరిది? ఎంత డబ్బు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రప్రభుత్వంలో అవినీతిని చూసి వారు వెళ్లిపోయారు.’

జనసేన పార్టీకి ఒక్కశాతం ఓట్లు వస్తాయని ముఖ్యమంత్రి అంటున్నారని,  ఆ ఒక్కశాతం ఓట్ల గురించేనా నాడు హైదరాబాదుకు వచ్చి తన సాయం కోరారని పవన్ కల్యాణ్ మేధావుల సమావేశంలో అన్నారు. రేవు దాటిన తర్వాత తెప్ప తగలేస్తున్నారని విమర్శించారు. 

click me!