కేసీఆర్ సర్కార్ కు పరిస్థితే జగన్ ప్రభుత్వానికీ... మొట్టికాయలు తప్పవు..: టిడిపి అనురాధ హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Feb 02, 2022, 05:39 PM IST
కేసీఆర్ సర్కార్ కు పరిస్థితే జగన్ ప్రభుత్వానికీ... మొట్టికాయలు తప్పవు..: టిడిపి అనురాధ హెచ్చరిక

సారాంశం

వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి నాయకురాలు పంచుమర్తి అనురాధ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ జీవోలను రహస్యంగా దాస్తూ సమాచార హక్కు చట్టానికి జగన్ సర్కార్ తూట్లు పొడుస్తోందని అనురాధ ఆరోపించారు.

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jagan) తీసుకుంటున్న తుగ్లక్ చర్యల వల్ల ప్రజా వ్యతిరేకత పెరిగిపోతోందని...అందువల్లే వైసిపి ప్రభుత్వం అప్రజాస్వామికంగా జీవోలను రహస్యంగా ఉంచుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ (panchumarthi anuradha) ఆరోపించారు. గతంలో ఇలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోలను రహస్యంగా ఉంచడంతో అక్కడి హైకోర్టు మొట్టికాయలు వేసిందని... జగన్ సర్కార్ కు కూడా మొట్టికాయలు తప్పవని అనురాధ హెచ్చరించారు. 

''ఏపీ ప్రభుత్వం పారదర్శకతను పూర్తిగా పాతరేస్తూ జీవోలను వెబ్ సైట్ లో పెట్టడంలేదు. ఇలా ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం ప్రజలకు అందకుండా చేసి సమాచారహక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయాలన్నీ ఆర్డర్స్ జీవోల రూపంలో https://goir.ap.gov.in/ పోర్టల్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 4(1)(సి) ప్రకారం ప్రభుత్వం ప్రతి సమాచారాన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలి'' అని అనురాధ పేర్కొన్నారు. 

''2005 నుండి సమాచార హక్కుచట్టం అమలులోకి వచ్చింది. 2007 నుండి నాటి ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించి జీవోఐఆర్‌ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. ఏ జీవోను దాచిపెట్టకూడదంటూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది'' అని తెలిపారు. 

''అధికారం చేతిలో ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటాం... అడిగేవారే లేరన్నట్లుగా రాజ్యాంగం, ప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా జగన్ రెడ్డి పాలన చేస్తున్నారు. తమ తప్పులు, వింత ఆదేశాలు బయటపడుతుండటంతో జీవోలను ప్రజల ముందు ఉంచకూడదని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 17, 2021 నుంచి జీవోఐఆర్‌లో జీవోలను అప్‌లోడ్‌ చేయడం ప్రభుత్వం మానేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8,500 జీవోలను జారీ చేశారు.  వీటిల్లో సర్కారు ఈ-గెజిట్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసినవి 620 జీవోలు మాత్రమే. కాని ప్రజాప్రయోజనాలు, ప్రభుత్వ పాలసీలు, చట్టాలు, రూల్స్‌ సవరణల జీవోలను ఎప్పటికప్పుడు ఏపీ గెజిట్‌లో పొందుపరుస్తున్నాం అని  చెప్పి హైకోర్టు కళ్లకు గంతలు కట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు'' అని అనురాధ ఆరోపించారు. 

''ప్రభుత్వ నిర్ణయాలు  ఇక బులుగు కరపత్రికల నుంచే తెలుసుకోవాలా? అవి కూడా పథకంలోని తప్పుడు నిర్ణయాలను రాయవు? నిజాలు చెప్పవు? అంటే ఇక ప్రజలకు నిజం తెలుసుకునే హక్కును కోల్పోయారా? జగన్ రెడ్డికి భజన బృంధాల ద్వారానే సమాచారం భయటకు వస్తుంది. ఏ పథకం ఎలా అమలు అవుతుంది, ఇసుకను ఎలా, ఎంత ధరకు అమ్ముతుంది, మద్యాన్ని ఏ విధంగా అమలు చేస్తుంది, ఏ పనులు ఎవరికి, ఎలా అప్పగించారు. ఇలాంటివి మచ్చుకు మాత్రమే.. ఇంకా ఎన్నో సమస్యలు ప్రజల దృష్టికి రావాల్సింది ఉంది. ఈ జీవోల విషయంలో 13 ఆగస్టు 2021న  తెలుగుదేశం పార్టీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. చట్టం ప్రకారం ప్రజలకు తెలియాల్సిన సమాచారాన్ని రహస్యంగా దాచిపెడుతున్న జగన్ రెడ్డి తుగ్లక్ చర్యలకు వ్యతిరేకంగా ప్రజల తరుపున తెలుగుదేశం పార్టీ పోరాడుతూనే ఉంది'' అని అనురాధ స్పష్టం చేసారు.

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu