Latest Videos

కార్పోరేటర్ నుండి ఏకంగా ఏపీ టిడిపి అధ్యక్షుడిగా... ఎవరీ శ్రీనివాస్ యాదవ్..? 

By Arun Kumar PFirst Published Jun 17, 2024, 11:06 AM IST
Highlights

పల్లా శ్రీనివాసరావు యాదవ్... ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాాజకీయాల్లో బాగా వినిపిస్తున్న పేరు. ఇటీవలే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేగా చరిత్ర స‌ృష్టించిన ఆయన ఇప్పుడు ఏకంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇంతకూ ఎవరీ పల్లా శ్రీనివాస్ యాదవ్..?

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల్లో వైసిపికి ఇంతటి ఘోర పరాభవం... టిడిపికి ఇంతటి భారీ విజయాన్ని ఎవరూ ఊహించలేదు. ఇక చంద్రబాబు కేబినెట్ లో కూడా ఎవరూ ఊహించని కొందరికి మంత్రిపదవులు దక్కాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ టిడిపి అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ యాదవ్ నియామకం కూడా ఎవరూ ఊహించనిదే. ఇలా ఎవరూ ఊహించని విధంగా ఏపీ రాజకీయాలు సాగుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కొనసాగుతున్న సీనియర్లను కాదని కీలక రాష్ట్ర అధ్యక్ష పదవి పల్లా శ్రీనివాసరావుకు దక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ క్రమంలో అసలు ఎవరీ పల్లా శ్రీనివాసరావు యాదవ్? ఆయన రాజకీయ ప్రస్థానం ఏమిటి? టిడిపి అధ్యక్షుడిగా ఆయననే ఎందుకు నియమించారు..? అసలు చంద్రబాబు ప్లాన్ ఏమిటి? అన్నది ఆసక్తికరంగా మారింది. 

ఎవరీ పల్లా శ్రీనివాసరావు యాదవ్..?

ఉత్తరాంధ్రలోని ప్రముఖ నగరమైన విశాఖపట్నంలోని గాజువాక పల్లా శ్రీనివాసరావు యాదవ్ స్వస్థలం. సామాన్య మధ్యతరగతి కుటుంబంలో 1969లో ఆయన జన్మించారు. పల్లా విద్యాబ్యాసం మొత్తం విశాఖపట్నంలోనే సాగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1995 లో ఎంబిఏ,  1998 లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఇన్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పూర్తిచేసారు.  

పల్లా శ్రీనివాస్ భార్య లావణ్య దేవి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్. వీరికి అంజనా కృష్ణశ్రీ, దేవ్ శ్రీకృష్ణ సింహ సంతానం. తాను పుట్టిపెరిగిన గాజువాకలోనే ఇప్పటికీ పల్లా శ్రీనివాస్ కుటుంబసమేతంగా నివాసం వుంటున్నారు. 

రాజకీయ ప్రస్థానం : 
 
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో సినీ నటుడు చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. చిరంజీవిపై అభిమానం, రాజకీయాల ఆసక్తితో ఆయన వెంట నడిచేందుకు పల్లా శ్రీనివాస్ సిద్దమయ్యారు. ఇలా ప్రజారాజ్యం పార్టీతో పల్లా రాజకీయ జీవితం ప్రారంభమయ్యింది. చిరంజీవి కూడా పల్లా శ్రీనివాస్ కు మంచి అవకాశమే ఇచ్చినా మొదటిసారికే సక్సెస్ కాలేకపోయాడు. 2009 లో ప్రజారాజ్యం పార్టీ తరపున విశాఖ లోక్ సభకు పోటీచేసిన పల్లా ఆనాటి కాంగ్రెస్ అభ్యర్థి పురంధేశ్వరి చేతిలో ఓడిపోయారు. 

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఆశించిన స్థాయిలో ఓట్లు, సీట్లు సాధించలేకపోయింది. దీంతో చిరంజీవి ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు... కానీ పల్లా శ్రీనివాస్ మాత్రం ఆయనవెంట నడవకుండా తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటినుండి ఇప్పటివరకు పల్లా పొలిటికల్ జర్నీ టిడిపిలోనే సాగుతోంది. 

ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కాంగ్రెస్ ఖతం అయ్యింది. 2014 ఎన్నికల్లో పోటీ కేవలం టిడిపి, వైసిపి మధ్యే జరిగింది... ఇందులోనూ టిడిపి హవా సాగింది. అప్పటికే గాజువాక ప్రజలకు పల్లా శ్రీనివాస్ బాగా చేరువయ్యాడు...దీంతో టిడిపి నుండి పోటీచేసిన ఆయన  మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 

అయితే 2019 లో వైసిపి గాలి వీయడంతో టిడిపి హేమాహేమీ నాయకులకు సైతం ఓటమి తప్పలేదు. ఇలా రెండోసారి గాజువాక బరిలో నిలిచిన పల్లా శ్రీనివాస్ కూడా ఓడిపోయాడు. ఈ ఓటమి పల్లాలో మరింత కసిని పెంచింది. ఈ ఐదేళ్ళు ప్రజల పక్షాన నిలిచి వైసిపి ప్రభుత్వంపై పోరాటం చేసాడు... విశాఖపట్నంలో టిడిపిని మరింత బలోపేతం చేయడానికి కృషిచేసాడు. ఈ క్రమంలోనే పల్లా శ్రీనివాస్ టిడిపిలో కీలక నేతగా మారాడు. 

2024 ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి హవాలో పల్లా శ్రీనివాస్ యాదవ్ బంపర్ మెజారిటీతో గెలిచారు. మాజీ  మంత్రి గుడివాడ అమర్నాథ్ ను ఏకంగా 95,235 ఓట్ల మెజారిటీతో ఓడించాడు. ఈ ఎన్నికల్లో పల్లాదే అత్యధిక మెజారిటీ.  

కార్పోరేటర్ నుండి అధ్యక్షుడిగా : 

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పల్లా శ్రీనివాస్ వ్యూహం మార్చాడు. ముందుగా క్షేత్రస్థాయిలో టిడిపిని బలోపేతం చేయడానికి  తానే స్వయంగా రంగంలోకి దిగారు. 2012లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కార్పోరేటర్ గా పోటీచేసారు. ఇలా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 67వ వార్డు నుండి కార్పోరేటర్ గా పోటీచేసి గెలుపొందారు. 

పల్లా శ్రీనివాస్ సేవలను గుర్తించిన చంద్రబాబు నాయుడు గతంలోనే విశాఖ జిల్లాలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఈ సమయంలోనే విశాఖ జిల్లాలో టిడిపి తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఈ ఎన్నికల్లో విశాఖలో టిడిపి అద్భుత విజయంలో పల్లా శ్రీనివాస్ పాత్ర విస్మరించలేనిది. ఎన్నికలకు ముందువరకు విశాఖ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిన పల్లా శ్రీనివాస్ యాదవ్ ఎన్నికల తర్వాత ఏకంగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. 

ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ టిడిపి అధ్యక్షులుగా పనిచేసినవారంతా ఉత్తరాంధ్రకు చెందినవారే. మొదట కళా వెంకట్రావు, ఆ తర్వాత కింజరాపు అచ్చెన్నాయుడు... ఇప్పుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ ఉత్తరాంధ్ర వాసులే. అంతేకాదు ఈ ముగ్గురూ బిసి నేతలే.  


 

click me!