ఇదే ఉయ్యాలవాడ ఒరిజినల్ ఫొటో

First Published Jan 29, 2018, 7:22 PM IST
Highlights
  • మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి గురించి అందరికీ తెలిసిందే.  సైరా నరసింహారెడ్డి చిత్రమంటే ఫక్తు చారిత్రాత్మకం. చిరంజీవిని అంతలా ఆకట్టుకున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇంతకీ ఎవరు? ఆ విషయాన్ని తెలుసుకోవటం కోసం నెటిజన్లు, అభిమానులు గూగులమ్మను తెగ వెతికేస్తున్నారు.

నరసింహారెడ్డి ఎవరు అన్న విషయంలో కొంత సమాచారం అందుబాటులో ఉన్నా, నరసింహారెడ్డి ఎలాగుంటారు అన్న విషయంలో మాత్రం పెద్దగా సమాచారం లేదు. అయితే, తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒరిజినల్ ఫొటో, ఆయన నివశించిన ఇల్లు, కోట లాంటివి దొరికాయి.

ఉయ్యాలవాడ 1846 ప్రాంతానికి చెందిన ఓ పాలెగాడు. ప్రస్తుత కర్నూలు జిల్లాలోని కోయిలకుంట్ల నియోజకవర్గంలో ఉంది ఉయ్యాలవాడ. ఉయ్యాలవాడ తండ్రి, తాత, ముత్తాతలంతా పాలెగాళ్ళే. బ్రిటీషు వాళ్ళకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ పోరాటం చేశారు. ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు ప్రాంతంలో క్యాంపు వేసిన బ్రిటీషు సైన్యాలపై 1846లోనే దాడి చేసి ఓడించారు. అయితే, ఉయ్యాలవాడను పట్టుకునేందుకు బ్రిటీషర్లు మళ్ళీ మెరుపుదాడి చేసారు. వారి నుండి తప్పించుకోవటంలో ఉయ్యాలవాడ కుటుంబాన్ని కోల్పోవాల్సి వచ్చింది.  ఉయ్యాలవాడను పట్టుకోలేకపోయిన బ్రిటీషు వాళ్ళు ఆయన కుటుంబాన్ని బంధించి కడప జైల్లో ఉంచారు.

నల్లమల అటవీ ప్రాంతానికి పారిపోయిన ఉయ్యాలవాడ తిరిగి తన కోట వద్దకు చేరుకున్నారు. అయితే ఈ విషయాన్ని గ్రామస్తులు బ్రిటీషువారికి ఉప్పందించటంతో రాత్రికి రాత్రి సైన్యాలు చుట్టుముట్టి పట్టుకున్నారు. తర్వాత వారిపై అభియోగాలు మోపటం, విచారించటం, కొందరిని బెయిలుపై వదిలేయటం, మరికొందరికి శిక్షలు వేయటం వరుసగా జరిగిపోయింది. కాకపోతే ఉయ్యాలవాడపై మోపిన అభియోగాలన్నీ వాస్తవాలే అని తేల్చి 1847, ఫిబ్రవరి 22వ తేదీన బహిరంగంగా ఉరి తీసి చంపేశారు. ఇది సంక్లిప్తంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర.

 

click me!