ఉద్యమించకపోతే... రేపటి తరాల నష్టాలకు మనమే బాద్యులం: చంద్రబాబు ఆవేదన

By Arun Kumar PFirst Published Dec 16, 2020, 10:40 AM IST
Highlights

రాజధాని ఉద్యమం, అమరావతి రైతుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు సోషల్ మీడియా వేదికన స్పదించారు.
 

అమరావతి: ఏపీ రాజధాని అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయ్యింది. అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టడంతో ఎగిసిన అమరావతి ఉద్యమం మొదలై 365 రోజులు అయ్యింది. ఏడాదిగా రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రైతులు, సామాన్య ప్రజలు, మహిళలు చేపట్టిన ఉద్యమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఈ రాజధాని ఉద్యమం, అమరావతి రైతుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ టిడిపి అధ్యక్షులు చంద్రబాబు సోషల్ మీడియా వేదికన స్పదించారు.

''విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానిగా ప్రణాళికాబద్ధమైన ప్రపంచస్థాయి నగరాన్ని నిర్మించుకునే అవకాశం మనకు వచ్చింది. రాజధానిగానే కాకుండా 13 జిల్లాల అభివృద్ధికి అవసరమైన సంపద సృష్టి, యువతకు ఉపాధి కేంద్రంగా ఆ నగరాన్ని నిర్మించాలనుకున్నాం'' అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

''ఆ కారణంగానే ఐదు కోట్ల ఆంధ్రులూ గర్వంగా చెప్పుకునేలా ప్రజారాజధాని అమరావతిని నిర్మించేందుకు ఆనాడు సంకల్పించాం. రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంత రైతులు 33వేల ఎకరాల భూములను త్యాగం చేశారు'' అని గుర్తుచేసుకున్నారు.

''ఆనాడు అమరావతి శంకుస్థాపన కోసం రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి పవిత్రస్థలాల మట్టిని, నీటిని పంపించి రాష్ట్ర ప్రజలు తమ ఆకాంక్షను, ఆమోదాన్ని తెలియజేసారు. అలా ఊపిరిపోసుకున్న అద్భుత రాజధాని అమరావతి నగరాన్ని ఈరోజు శిధిల స్థితిలో చూస్తుంటే బాధేస్తోంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
''రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ఈ ప్రభుత్వం ఆడుతోన్న మూడు ముక్కలాటకు వ్యతిరేకంగా ఉద్యమించకపోతే రేపటి తరాలకు కలిగే నష్టాలకు మనమే బాద్యులం అవుతాం. అందుకే రాష్ట్ర ప్రజా రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలి. ఆంధ్రులందరిదీ ఒకే మాట,ఒకే రాజధాని అని చాటాలి'' అని చంద్రబాబు పిలుపునిచ్చారు. 

click me!